14 May, 2026 | 1:41 AM

పండించడానికి అప్పులు.. అమ్ముకోవటానికి ధర్నాలు..

14-05-2026 12:00 AM

కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల ఆవేదన

బెజ్జంకి మే 13: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు , వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొండల్లా పేరుకుపోయినా ఇప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో, వర్షంలో యార్డుల వద్దే కాపలా కాస్తూ తమ ధాన్యాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

గత ప్రభుత్వ హయాంలో ధాన్యం రంగు మారినా, తడిసినా కొనుగోలు చేసేవారని, కానీ ప్రస్తుతం యార్డుల్లో ధాన్యం పేరుకుపోయినా అధికారులు పట్టించు కోవడం లేదని ఆరోపిస్తున్నారు. పంట పండించడానికి అప్పులు చేశాం ,ఇప్పుడు అమ్ముకోవాలంటే రోడ్లపై ధర్నాలు చేయాల్సి వస్తోంది,అంటూ రైతులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు గుర్తొస్తారా అంటూ ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వర్ష భయంతో ధాన్యం పాడైపోతుందనే ఆందోళన..

ఇటీవల వర్ష సూచనలు ఉండటంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో తగిన షెడ్లు, రక్షణ సదుపాయాలు లేకపోవడంతో ధాన్యం తడిసి పూర్తిగా పాడైపోతుందనే భయం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే మా పంటకు ఎవరు బాధ్యత తీసుకుంటారు ,అప్పుల బాధతో మళ్లీ ఆత్మహత్యలే దిక్కా, అంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వరి కొనుగోళ్లు కూడా సరిగా లేవు..

పొద్దుతిరుగుడు మాత్రమే కాకుండా వరి ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరగడం లేదని రైతులు అంటున్నారు. పడి క్లీనర్లు పనిచేయకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడికక్కడే పేరుకుపోవడం, లారీల రాకపోవడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు.

పొద్దుతిరుగుడు ధాన్యం  కొనుగోలులో కేంద్ర కోటా ముగిసిందని, రాష్ట్ర కోటాకు అనుమతి లేదని అధికారులు చెబుతు న్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కొంతమంది రైతులకు కూడా చెల్లింపులు అందలేదని వాపోతున్నారు. కొనుగోలు నిలిచిపో వడంతో కొందరు రైతులు ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుండగా, మరికొందరు దళారులకు తక్కువ ధరకు అమ్ము కుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభించి, పెండింగ్ చెల్లింపులు చేయాలని మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.