12 May, 2026 | 1:23 AM

మా ధాన్యం కొనండి మహాప్రభో

12-05-2026 12:00 AM
  1. కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
  2. మక్కలు కొనేదెప్పుడు.. బాధలు తీరేదెప్పుడు..
  3. ఎదురుచూస్తున్న రైతులు..

తాడ్వాయి, మే, 11 (విజయక్రాంతి): ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. మా ధాన్యం కొనండి మహాప్రభో... అంటూ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయినా ఉలుకు పలుకు లేని అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  బయట దళారుల వద్దకు వెళ్తే వారు తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు. బయట దళారులు ఒక్కో క్వింటాల్ మక్కలను రూ.1700 ల నుంచి రూ.1800 లకు కొనుగోలు చేస్తున్నారు. దళారుల కు అమ్మితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కేంద్రాలు ఆమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదు.

పడిగాపులు పడుతున్న రైతులు

మక్కల కొనుగోలు కేంద్రంలో మక్కలు విక్రయించుకుందామంటే ఇక్కడ ఇబ్బందులు తప్పడం లేదని రైతులు బోరుమంటున్నారు. కామారెడ్డి జిల్లా లోని తాడ్వాయి మండలం నందివాడ, ఎర్రపహాడ్, ఏండ్రియాల, బ్రాహ్మణపల్లి, తాడ్వాయి, చిట్యాల, బ్రహ్మాజీవాడి, బ్రాహ్మణపల్లి, చందాపూర్ గ్రామాల్లో మక్కలు ప్రధాన పంటగా ఈ యాసంగిలో పండించారు.

పండించిన పంటను ప్రభుత్వమే కొంటుంది. ఎవరు ఇబ్బందులు పడవద్దని అధికారులు చెప్పిన ఆచరణలో అమలు అవడం లేదు.  రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.కొనుగోలు కేంద్రాల్లో గత వారం రోజుల నుంచి మక్కలను తీసుకొచ్చి కుప్పలుగా పోసుకున్నారు. ఆయిన ఎవరు స్పందించడం లేదు.మక్కల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పగలు,రాత్రి పడుకుని పడిగాపులు కాస్తున్నారు.

కొనుగోలు వేగవంతం చేయాలి

మక్కల కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలి. కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతు 50 క్వింటాళ్ల నుంచి 200 ధాన్యాన్ని కుప్పలుగా పోసుకొని ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందోనని రైతులు భయంతో వణికిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలు ఉండిపోతున్నాయి.

ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి

రైతుల ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి. గతంలో తరుగు పేరుతో అధికారులు దోపిడీకి పాల్పడ్డారు. ఒక్కో రైతు నుంచి 50 కిలోల నుంచి రెండు కింటాళ్ల వరకు తరుగు పేరుతో ధాన్యం డబ్బులు కోత విధించారు.ఈసారి అలా చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రైతుల హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని చెబుతున్న ఆచరణలో మాత్రం పెట్టడం లేదని రైతులు బగ్గుమంటున్నారు.

వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే ధాన్యాన్ని తరలించాలి. ధాన్యం తరలించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నేను 100 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చాను. వెంటనే కొనుగోలు చేపట్టాలి.

- చిట్టెపు భూమ్ రెడ్డి, రైతు, నందివాడ

తరుగు పేరుతో డబ్బులు కట్ చేస్తే ఊరుకోం

తరుగు పేరుతో దాన్యం డబ్బులు కట్ చేస్తే ఊరుకోం.తాను 100 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చా.

- రామ్ చందర్ రావు, రైతు, ఎండ్రియాల్