ఆత్మ రక్షణకు కరాటే దోహదం
సినీ నటుడు సుమన్
పటాన్చెరు, మే 11 :ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం విద్యార్థినీలు, మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని.. దీని ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ధారుడ్యం లభిస్తుందని సినీ నటుడు సుమాన్ అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని భారతరత్న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో.. లక్కీ మార్షల్ ఆరట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక పదవ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో సుమన్ మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి కలిగి.. నిరంతరం క్రీడల అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దొరకడం పటాన్చెరు నియోజకవర్గం ప్రజల అదృష్టమని అన్నారు. గత పది సంవత్సరాలుగా జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు సహకారం అందించడం పట్ల అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలకు పటాన్చెరు కేంద్రంగా నిలవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, వెంకటేష్, షకీల్, రామ్మోహన్, వినోద్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.






