8 August, 2026 | 1:07 AM

బెట్టింగ్ ఉచ్చులో సిద్దిపేట యువత

08-08-2026 12:18 AM
  1. స్మార్ట్ ఫోన్ ముసుగులో ‘ఆన్‌లైన్ జూదం’.. అప్పుల ఊబిలో కుటుంబాలు
  2. లక్షల జీతాలొచ్చినా.. లక్షల అప్పులే!
  3. గమనించకపోతే గడప దాటే విషాదం

సిద్దిపేట, ఆగస్టు 7 (విజయక్రాంతి) : స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చింది. ప్రపంచం అరచేతిలోకి వచ్చిందనుకున్నాం. కానీ అదే ఫోన్ కొందరి జీవితాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలన్న అత్యాశ, ఒక్కసారి గెలిస్తే చాలు అనే భ్రమ, పోయిన డబ్బును తిరిగి రాబట్టాలన్న పట్టుదల, చివరకు బెట్టింగ్ బానిసత్వంగా మారుతోంది. పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అనే తేడా లేకుండా ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్న ఘటనలు సిద్దిపేట ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆన్లైన్ బెట్టింగ్ మొదట సరదాగా మొదలవుతుంది. చిన్న మొత్తంతో ఆడటం, ఒకసారి గెలవడం, వచ్చిన డబ్బుతో మరింత ఆశ పెరగడం, ఓడినప్పుడు పోయిన మొత్తాన్ని తిరిగి సంపాదించాలనే ఆలోచనతో మరింత డబ్బు పెట్టడం, ఇలా తెలియకుండానే అప్పుల చక్రంలో చిక్కుకుంటున్నారు. చేతిలో డబ్బు లేకపోతే స్నేహితులు, బంధువులు, ఫైనాన్స్ సంస్థలు, ఇతర మార్గాల్లో అప్పులు చేసి బెట్టింగ్కు పెట్టే స్థాయికి వెళ్తున్నారు.

సిద్దిపేటలో.... 

సిద్దిపేటలో ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనలు ఈ ప్రమాదానికి అద్దం పడుతున్నాయి. ప్రైవేటు సంస్థలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తూ నెలకు సుమారు రూ.2 లక్షల ఆదాయం పొందుతున్న వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి భారీగా అప్పులు చేసినట్లు సమాచారం. అప్పులు తీర్చడం కష్టంగా మారడంతో సిద్దిపేట శివారులోని ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మంచి ఉద్యోగం, గణనీయమైన ఆదాయం ఉన్నప్పటికీ బెట్టింగ్ వ్యసనం జీవితాన్ని ఎంతటి అంచుకు తీసుకెళ్లగలదో ఈ ఘటన హెచ్చరిస్తోంది.

బీటెక్ (సైబర్ సెక్యూరిటీ) విద్యార్థి కూడా ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై భారీగా అప్పులు చేసినట్లు సమాచారం. కొడుకు చేసిన అప్పులను తీర్చేందుకు తల్లిదండ్రులు సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేసి చెల్లించినప్పటికీ బెట్టింగ్ ఆపలేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. అనంతరం హైదరాబాద్లోని తాను ఉంటున్న అద్దె గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇదివరకు సిద్దిపేట ప్రాంతానికి చెంది ఓ కానిస్టేబుల్ కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఉంది. 

ఫోన్ చూస్తున్నాడు, కానీ ఏం చేస్తున్నాడో తెలుసా?

ఇంట్లో తల్లిదండ్రులు తమ పనుల్లో, పిల్లలు తమ ఫోన్లలో, ఉద్యోగులు ఆఫీసుల్లో, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లోనే, కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ తగ్గిపోవడం, పిల్లల ఫోన్ వినియోగంపై పర్యవేక్షణ లేకపోవడం ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్లు, అనుచిత కంటెంట్ వంటి వాటికి యువత ఆకర్షితులవుతున్నా చాలాసార్లు కుటుంబ సభ్యులకు విషయం ఆలస్యంగా తెలుస్తోంది. అకస్మాత్తుగా డబ్బులు అడగడం, ఖర్చులు పెరగడం, ఫోన్ను ఎవరికీ చూపకుండా దాచడం, రాత్రివేళల్లో ఎక్కువసేపు మేల్కొని ఉండటం, చదువు లేదా ఉద్యోగంపై ఆసక్తి తగ్గడం, చిరాకు, ఒంటరితనం, అప్పుల కోసం పదేపదే ప్రయత్నించడం వంటి మార్పులు కనిపిస్తే కుటుంబ సభ్యులు అప్రమత్తం కావాలి.

వ్యసనాన్ని ఆపించడమే అసలు పరిష్కారం... 

అప్పులు తీర్చడం కాదు. బెట్టింగ్కు అలవాటుపడిన వ్యక్తిని తిట్టడం, అవమానించడం లేదా కొట్టడం సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తుంది. ముందుగా కుటుంబ సభ్యులు అతడితో ప్రశాంతంగా మాట్లాడాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణులు, కౌన్సిలర్ల సహాయం తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలపై నియంత్రణ, అనవసర యాప్ల తొలగింపు, బ్యాంకింగ్ యాక్సెస్పు తాత్కాలిక పర్యవేక్షణ, కుటుంబ సభ్యుల నిరంతర సహకారం వంటి చర్యలు చేపట్టాలి.

ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇవ్వడం తప్పు కాదు. ఫోన్లో వారు ఏం చేస్తున్నారో తెలుసుకోకపోవడమే ప్రమాదం. బెట్టింగ్ ఒక ఆట కాదు, డబ్బు, కుటుంబం, భవిష్యత్తును పణంగా పెట్టే వ్యసనం. సిద్దిపేటలో వెలుగుచూస్తున్న ఘటనలు హెచ్చరిక మాత్రమే. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఒక్కసారి తమ పిల్లల ఫోన్ను కాదు. వారి ప్రవర్తనను గమనించాల్సిన సమయం వచ్చింది. బెట్టింగ్లో గెలిచేది డబ్బు కాదు. చివరికి వ్యసనమే గెలుస్తుంది. ఓడిపోయేది మాత్రం ఒక మనిషి జీవితం మాత్రమే కాదు. ఒక కుటుంబం మొత్తం బలి అవుతుంది.