రైతు బీమా పునరుద్ధరించాలి
- తక్కువ వర్షపాతంతో ఇబ్బందులు
- త్వరలో ప్రాజెక్ట్‌లను సందర్శిస్తా
- విద్యార్థులపై లాఠీచార్జి సరికాదు
- కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాలి
- బీజేపీ ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్, ఆగస్టు 25 (విజయక్రాం తి): రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, రైతు బీమా పునరుద్ధరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని ప్రీమియం చెల్లించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరు ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆగస్టు 13తో రైతు బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.
కేంద్రంలోని ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.. తక్కువ వర్షపాతం కారణంగా రైతులు పంటలపై పెట్టుబడులు పెట్టి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, సర్టిఫికెట్లు అందక యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు--రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని ఆరోపించిన డీకే అరుణ.. పెండింగ్ పనులు పూర్తి చేయకుండా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచడం ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పనులను పరిశీలించేందుకు త్వరలో పత్రికా ప్రతినిధులతో కలిసి జిల్లా ప్రాజెక్టులను సందర్శిస్తానని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను రివైజ్ చేసి, అవసరమైన నిధులు కోరితే కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, అచ్చుగట్ల అంజయ్య, జనార్ధన్‌రెడ్డి, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.






