30 June, 2026 | 1:21 AM

భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలి

30-06-2026 12:03 AM

కొడంగల్, జూన్ 29 (విజయక్రాంతి ):కొడంగల్ మున్సిపల్ పరిధితో పాటు దౌల్తాబాద్, మాటూరు, నీటూరు, పెద్ద నందిగామ, ప్యాలమద్ది గ్రామాల పరిధిలో మొత్తం 17.8 కిలో మీటర్ల మేర అధికారులు భూ సేకరణ చేపట్టనున్నారు. భూములు కోల్పోతున్న రైతుల నుంచి అభిప్రాయాలను తెలుసుకునేందుకు సోమవారం కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఆర్డివో అనిత సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా రైతులు , కొడంగల్ మున్సిపల్ రెండో వార్డు మాజీ కౌన్సిలర్ మధు సూదన్ యాదవ్ మాట్లాడుతూ... కొడంగల్-నారాయణ పేట ఎత్తిపోతల పథకం పనుల్లో భూములు కోల్పోతున్న రైతులు నష్ట పోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలనికోరారు. ఎత్తి పోతల పథకంలో కాలువ నిర్మాణ పనులను బై పాస్ రోడ్డు నుంచి చేపట్టాలన్నారు. వ్యవసాయ భూముల్లో నుంచి కాలువ నిర్మాణంతో 48 మంది రైతులకు చెందిన భూములు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందన్నారు.

ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎత్తి పోతల పథకం పనుల్లో కొడంగల్ పెద్ద చెరువు ఆయకట్టు నుంచి చేపట్టే కాలువ నిర్మాణం బై పాస్ రోడ్డు నుంచి చేపట్టాలని, లేని పక్షంలో రైతులకు ఎకరాకు రూ.50 లక్షలు నష్ట పరిహారం అందించాలన్నారు. ఈ విషయాన్ని  జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డివో హామీ ఇచ్చినట్లు మధు సూదన్ యాదవ్ తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ బల్ రామ్ నాయక్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.