23 May, 2026 | 2:05 AM

రైతుల సమస్యలు పరిష్కరించాలి

23-05-2026 01:15 AM
  1. వడ్లు, మక్కల సేకరణలో రైతులు ఆగం
  2. మంత్రి పొంగులేటికి ఎంపీ ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి 

ముషీరాబాద్, మే 22 (విజయక్రాంతి): వడ్లు, మక్కలు ధాన్యం సేకరణలో రైతులు ఆగమవుతున్నారని, ఆరుగాలం కష్టపడి పండించిన మక్కల కేంద్రాలకు తెచ్చినా కొనే దిక్కులేక ఆందోళన చెందుతున్నారని డీసీఎంఎస్, పీఏసీఎస్‌లు ఆర్భాటంగా తెరిచిన కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక కొనుగోళ్ల తీరు అస్తవ్యస్తంగా మారడంతో రైతులకు అరిగోస తప్పడం లేదని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించి, రైతు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రిని కలిసిన వారిలో ర్యాగ అరుణ్ కుమార్, నీల వెంకటేష్, అనంతయ్య, వంశీకృష్ణ, రఘుపతి, నిఖిల్ పటేల్ భీమరాజ్ తదితరులున్నారు. ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటల సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగ్గదని వెంటనే జోక్యం చేసుకోవాలని, అధికారులకు కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. సేకరణలో వేలాది ఫిర్యాదులు వస్తు న్నాయన్నారు.

అంచనాలకు మించి ఈసారి రాష్ట్రంలో రైతులు పంటలు పండించారని చెప్పారు. కానీ ధాన్యం సేకరణలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనబడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం సేకరించడంలో తూకం వేసి తరలించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వివరించామని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.