ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 29: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలోని తానంచర్ల - నకిరేకల్ జాతీయ రహదారిపై గల సబ్ మార్కెట్ యార్డు వద్ద బుధవారం రైతులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తగినన్ని లారీలు రాకపోవడంతో కాంటాలు నిలిపివేశారని,వెంటనే కొనుగోలు కేంద్రానికి లారీలు కేటాయించి కాంటాలు పెట్టాలని డిమాండ్ చేశారు.
అన్నదాతలు ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా నిరసన తెలుపుతున్నా అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు ధాన్యాన్ని రహదారిపై పోసి నిప్పంటించి నిరసన తెలిపారు.రైతుల ధర్నా విషయం తెలుసుకున్న జాజిరెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీకాంత్,ఎస్త్స్ర సైదులు సంఘటన స్థలానికి చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.






