26 March, 2026 | 2:53 AM

పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాలి

26-03-2026 12:00 AM

డ్రిప్, స్ప్రింక్లర్లను అందించేందుకు చర్యలు తీసుకుంటాం

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): వాతావరణ మార్పులు, అకాల వ ర్షాలు, ఇతర కారణాలతో ఆయా పంటల విషయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని అధిగమించేలా శాసన సభ్యులందరూ రైతులు పంట మార్పిడి వైపు ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనువైన ప్రాంతమని, ఆ దిశగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.

బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నల కు మంత్రి తుమ్మల సమాధానమిస్తూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.500 కోట్ల వ్యయంతో 5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 126 గోదాములను నిర్మించినట్టు పేర్కొన్నారు.

అలాగే, రైతులకు ఇప్పటికే డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను అందజేసినట్టు పేర్కొంటూ, అవసరమున్న ప్రాంతాలలో మరిన్ని డ్రిప్, స్ప్రింక్లర్లను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మార్కెటింగ్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పరికరాలను సమకూర్చిందన్నారు. వర్షాల ప్రభావం నుంచి రైతుల పంటలను రక్షించడానికి, మార్కెటింగ్ కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు 2023- నుంచి 2025- వరకు రూ.116 కోట్లు ఖర్చు చేశామని, ప్రస్తుత సీజన్‌కు సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.