ఉద్యాన పంటల విస్తరణకు రైతులు ముందుకు రావాలి
హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష
సంగారెడ్డి, మే 17 : ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచుతూ అధిక ఆదాయం పొందాలని హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. ఆదివారం సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె, కార్యక్రమాన్ని ప్రారంభించి ఏర్పాటు చేసిన మామిడి ప్రదర్శనను పరిశీలించారు.
ఫల పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో వివిధ రకాల మామిడి పండ్లను ప్రదర్శించగా, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుండి అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల విస్తీర్ణం పెంపు కోసం రైతులకు అనేక ప్రోత్సాహక పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగు విస్తరణ ద్వారా అధిక ఆదాయం పొందాలని సూచించారు.
జిల్లా ఉద్యాన అధికారి పి.సోమేశ్వరరావు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో సుమారు 16 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తూ నాణ్యమైన మామిడి పండ్ల ఉత్పత్తి చేపడితే విదేశాలకు ఎగుమతులు చేసి అధిక లాభాలు పొందవచ్చన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ పి. సురేష్, డాక్టర్ కె. వెంకటలక్ష్మి, డాక్టర్ బాబు, డాక్టర్ ఏ. కిరణ్ కుమార్, శాస్త్రవేత్తలు మౌనిక, నవీన్, నితీష్ కుమార్, ఉద్యాన అధికారులు, ఉద్యాన విస్తరణాధికారులు, డ్రిప్, గోద్రెజ్, ఆగ్రోవెట్ సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






