27-10-2025 04:55:28 PM
తహశీల్దార్ శ్రీకాంత్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: మొంథా తుఫాను ప్రభావంతో మండలంలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తహాశీల్దార్ బాషపాక శ్రీకాంత్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ఇప్పటివరకు 40 ధాన్యం రాశులు వచ్చాయని, ధాన్యాన్ని ఎత్తయిన ప్రదేశంలో ఉంచాలని, లోతట్టు ప్రాంతంలో ఉంచరాదని అన్నారు. కేంద్రాల్లో తగినన్ని టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. తుఫాను ప్రభావంతో నష్టం జరగకుండా అవసరమైన వసతులు కల్పించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఆర్ఐ వెంకట్ రెడ్డి, నిర్వాహకులు, రైతులు తదితరులు ఉన్నారు.