రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి
- వ్యవసాయ ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖల కార్యకలాపాల ప్రగతిపై
సుదీర్ఘంగా చర్చించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఏప్రిల్ 9(విజయ క్రాంతి) : కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గురువారం వ్యవసాయ శాఖ మరియు అనుబంద శాఖలు లీడ్ బ్యాంక్ మేనేజర్, హార్టికల్చర్ & సెరికల్చర్, మత్స్య శాఖ మరియు పశువైద్య శాఖ వారికీ సమవేశం ఏర్పాటు చేసారు. ముందుగా వ్యవసాయ శాఖ ప్రగతిపై మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు, వ్యవసాయంలో స్థిరత్వాన్ని సాధించేందుకు పంట వివిధీకరణ అత్యంత అవసరమని పేర్కొన్నారు.
వరి వంటి సంప్రదాయ పంటలపై ఆధారపడకుండా, పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్ల పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. దీని ద్వారా రైతులు మంచి లాభాలను పొందగలరని తెలిపారు. పంటల మార్పిడి , నీటి వినియోగంలో మితవ్యత, నేల ఆరోగ్యం పరిరక్షణ వంటి అంశాలను కూడా ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, శిక్షణా కార్యక్రమాల ద్వారా రైతులకు సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. పశుసంవర్ధక శాఖ పై సమీక్షిస్తూ.. గాలి కుంట వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
పశువైద్యం మందులన్నీ అందుబాటులో ఉండాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ పై సమీక్షిస్తూ.. మత్స్య శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. జిల్లాలో ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చేపల పెంపకంపై, చేపల ఉపాధి పై అవగాహన కల్పించాలన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు లేని గ్రామాల్లో నూతన రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. మత్స్యకార మహిళలకు చేప ఉత్పత్తి వంటకాలు నేర్పించి ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉద్యానవన శాఖ ద్వారా రైతులను పామాయిల్ పంట వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలన్నారు జిల్లాలో పామాయిల్ విస్తీర్ణం పెరగాలని లక్ష్యాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య , మత్స్య శాఖ అధికారి మల్లేశం, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ , ఎల్ .డి ఎం బాపూజీ, తదితరులు పాల్గొన్నారు.




