యూరియాకు రైతన్న తిప్పలు.. క్యూలైన్లో చెప్పులు
*సొసైటీల వద్దనే ఇలా పడిగాపులు పడాల్సి వస్తుందంటున్న రైతులు
పాపన్నపేట,సెప్టెంబర్02: యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతూనే ఉన్నారు. ఒక్క యూరియా బ్యాగ్ కోసం రోజంతా తిండి తిప్పలు, పనులు మానుకొని నానా పాట్లు పడుతున్నారు. తాజాగా బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెప్పులు ఇలా క్యూ లైన్ లో పెట్టి కార్యాలయ భవనాల నీడ పట్టుకు పడిగాపులు కాస్తున్నారు.
రైతును రాజును చేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు యూరియా కోసం ఇలా క్యూలైన్లో నిలబెట్టి బికార్లను చేస్తారా అని రైతులు ఆగ్రహిస్తున్నారు. సొసైటీల వద్దనే ఇలా పడిగాపులు పడాల్సి వస్తుందని.. ప్రైవేట్ డీలర్ల వద్ద ఇంత ఇబ్బంది లేదని వాపోతున్నారు. యూరియా కోసం రైతన్నలు ఇలా తిప్పలు పడకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






