30 May, 2026 | 5:36 PM

రైతు ఆత్మహత్యాయత్నం జరిగినా కొనుగోలు కేంద్రాన్ని పట్టించుకోని చైర్మన్?

30-05-2026 04:52 PM

తడిసి మొలకెత్తుతున్న ధాన్యం... లారీల కోసం రైతుల నిరీక్షణ

"చైర్మన్ సాబ్ జరా దేఖో..." అంటూ రైతుల ఆవేదన

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఇబ్రహీంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, లారీల కొరత, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతు లంబాడి భిక్షపతి కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ప్రాంతంలో కలకలం రేపింది.

రైతు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు శనివారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ రమేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుజాత అక్కడికి చేరుకుని రైతు ధాన్యం కుప్పలను పరిశీలించి పరిస్థితిని తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, నెల రోజుల క్రితమే కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటికీ ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వేలాది బస్తాలు కేంద్రాల వద్ద పేరుకుపోయాయని తెలిపారు.

ఇప్పటికే పలు మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని వాపోయారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయి, కొన్ని చోట్ల మొలకలు కూడా రావడం ప్రారంభమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. తమ కష్టార్జిత పంట కళ్లముందే పాడవుతుంటే అధికారులు, సొసైటీ నిర్వాహకులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రైతు భిక్షపతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేంత వరకు పరిస్థితులు దిగజారినా బాధ్యులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

ప్రత్యేకించి సొసైటీ చైర్మన్ వ్యవహారశైలిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నా, రైతులు ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించినా చైర్మన్ స్పందించలేదని ఆరోపించారు. రైతు ఆత్మహత్యాయత్నం వంటి విషాద ఘటన జరిగిన తర్వాత కూడా కేంద్రాన్ని సందర్శించి రైతులను పరామర్శించకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే చైర్మన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

"చైర్మన్ సాబ్ జరా దేఖో... మా ధాన్యం తడిసి మొలకెత్తుతోంది, రైతులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తోంది. అయినా మీరు ఒక్కసారి కూడా కేంద్రానికి రాలేదు. మా సమస్యలు మీకు కనిపించడం లేదా?" అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల్లో ఆందోళన, అసంతృప్తి నెలకొంది.