7 April, 2026 | 3:05 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

07-04-2026 01:14 AM

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ప్రభుత్వ విప్ వేముల వీరేశం

కట్టంగూరు, ఏప్రిల్ 6 : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండల కేంద్రంతో పాటు ముత్యాలమ్మగూడెం, పిట్టంపల్లి, ఎరసానిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఘనంగా ప్రారంభించి మాట్లాడారు.

నకిరేకల్ నియోజకవర్గంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ ఆధ్వర్యంలో మొత్తం 50 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడటమే కాకుండా, రవాణా సౌకర్యాలు మరియు మిల్లర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఐకేపీ కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాల పాత్ర అభినందనీయమని కొనియాడారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల లేదా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నియోజకవర్గంలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమమే మా ప్రాధాన్యత అని, పండించిన పంటకు సరైన ధర కల్పించి, రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని వేముల వీరేశం చెప్పుకొచ్చారు.  మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు  పాల్గొన్నారు.