రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని, రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఘనాపూర్ మండలంలోని జంగుపల్లి, బస్వరాజపల్లి, ధర్మారావు పేట, నగరంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు మధ్యవర్తుల సమస్యలు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరుగుతుందని తెలిపారు. అలాగే రైతులకు తక్షణ చెల్లింపులు, రవాణా సౌకర్యాలు వంటి అనేక ప్రయోజనాలు అందుతాయని వివరించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోనీ అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎటువంటి కోతలు లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.






