24 April, 2026 | 1:48 AM

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

24-04-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్  సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియపై క్షుణ్ణంగా సమీక్షించి, పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతిలో గల వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితరాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

అలాగే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న సాదాబైనామా  సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టర్ సంబంధిత అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. సాదాబైనామా కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి, ప్రతి దరఖాస్తును సమగ్రంగా ధృవీకరించాలన్నారు. భూ సంబంధిత పత్రాలు, పాత రికార్డులు, ఆదాయ పత్రాలు, తదితర వివరాలను ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, అన్ని మండలాల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.