16 June, 2026 | 3:14 AM

నల్లగొండపై పోలీస్ బాస్ నారాజ్!

16-06-2026 02:13 AM
  1. అధికార పార్టీ నాయకులతో అంటగాగుతున్న కొందరు సిబ్బంది!                                                           
  2. పరిధి దాటి ప్రవర్తించడంపై సీరియస్
  3. పైరవీ చేసినందుకే ఓ మండల స్థాయి అధికారిపై డిసిప్లినరీ యాక్షన్
  4. ఇద్దరు డివిజన్ స్థాయి అధికారుల తీరుపై విచారణ?
  5. నల్లగొండ పోలీసు శాఖలో కలకలం
  6. చర్చనీయాంశంగా ఫాంహౌజ్ వ్యవహారం

నల్లగొండ/కట్టంగూర్ జూన్ 15 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా పోలీసు శాఖపై తెలంగాణ పోలీసు బాస్ (డీజీపీ) స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. జిల్లా పరిధిలో పోలీసు సిబ్బంది వ్యవహారాలు.. అక్రమాల బాగోతం ఆయన వద్దకు చేరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధానంగా అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ కొందరు అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నట్టు సమాచారం.

జిల్లాలోని ఓ ఇద్దరు పోలీసు అధికారులు మరో ప్రైవేటు వ్యక్తితో కలిసి ఫాంహౌజ్లో పార్టీ చేసుకోవడం.. అదికాస్త వివాదస్పదంగా మారడంతో విషయం పోలీసు బాస్ వరకు చేరినట్లు తెలుస్తుంది. దీంతో ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఆయన స్పెషల్ టీమ్ రంగంలోకి దింపినట్లు వినికిడి. అయితే అసలు ఆ ప్రైవేటు పార్టీ వెనుక ఉన్న అసలు సంగతిని బయటపెట్టేందుకు మూడు, నాలుగు రోజులుగా ఆరా తీస్తున్నారని సమాచారం. అయితే ఈ వ్యవహారం కాస్త జిల్లా పోలీసు అధికారుల మెడకు చుట్టుకునే ప్రమాదం పొంచి ఉండడంతో స్థానిక అధికారుల్లోనూ గుబులు మొదలయిట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పైరవీ చేయించినందుకేనా..? 

ఇదిలావుంటే.. ఇటీవల నల్లగొండ జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఒకేచోట లేదా కీలక స్టేషన్లలో పనిచేసిన అధికారులను నిబంధనల ప్రకారం ఎలాంటి లూప్ లైన్ లేదా నాన్-ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టింగులకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులు ఒక జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాలో ఓ ఎస్‌ఐ పేరు సైతం ఉంది. అయితే అప్పటికే అధికార పార్టీ నేతలతో పీకల్లోతు అంటకాగిన సదరు ఎస్‌ఐ.. ఏకంగా పోలీస్ బాస్కే ఫోన్ కొట్టించి ట్రాన్స్ఫర్ ఆపడమో.. సమీపంలోని స్టేషన్ అలాట్ చేయడమో చేయాలంటూ ఫుల్ ప్రెజర్ చేయించినట్టు వార్తలు బయటకు వచ్చాయి.

ఇదే వ్యవహారంపై పోలీసు బాస్ సీరియస్ అయ్యారని సమాచారం. పోలీస్ నియమ, నిబంధనల ప్రకారం బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం, వారి ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకురావడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం కిందికి వస్తుంది. సదరు ఎస్‌ఐ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు.. డిపార్ట్మెంట్ లో ఇలాంటి పైరవీ సంస్కృతిని సహించేది లేదనే సంకేతాలు పంపేలా తక్షణమే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరికొంతమందిపైనా ఆరోపణలు.. :

జిల్లాలోని ఓ సీఐ స్థాయి అధికారి సైతం సుదీర్ఘకాలంగా ఒకే డివిజన్ పరిధిలో అది కూడా సొంత డివిజన్లో పనిచేస్తుండడం వివాదాస్పదంగా మారింది. ఎస్‌ఐ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు అదే డివిజన్లో తిరుగుతున్నారనే ప్రచారం స్థానికంగా సాగుతుంది. ఇదే సమయంలో అధికార పార్టీతో అంటకాగుతూ వివాదాస్పద వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని డిపార్ట్మెంట్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. మరోవైపు ఓ డివిజన్ స్థాయి అధికారి పోస్టింగ్ విషయంలోనూ దాదాపు నెల రోజులుగా వివాదం నడిచింది.

సదరు అధికారి ట్రాన్స్ఫర్ కావడం.. కొత్త అధికారి రావడం.. ఆయన జాయిన్ అవ్వకుండానే వెళ్లిపోవడం.. మళ్లీ పాత అధికారే కొనసాగడం చిన్న పాటి సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. ఈ సస్పెన్స్ అంతటికి తెరదించుతూ సదరు అధికారిని అక్కడి నుండి పోలీస్ బాస్ తప్పించినట్లు పోలీసు వర్గాలే చెబుకుంటున్నట్లు వినికిడి. అలాగే మరో డివిజన్ స్థాయి అధికారి పైన పలు ఆరోపణలు వినిపిస్తుండడంతో శాఖపరమైన విచారణ జరుపుతున్నట్టు సమాచారం. నేడో, రేపో ఆ అధికారిపై కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు స్థానికంగా గుప్పుమంటున్నాయి. అయితే ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలంటే మాత్రం ఎదురు చూడక తప్పదు.

ఫాంహౌజ్ వ్యవహారం నిజమేనా..? 

జిల్లా పరిధిలోని ఓ ఇద్దరు మండల స్థాయి పోలీసు అధికారులు, మరో ప్రైవేటు వ్యక్తితో కలిసి ఇటీవల మునుగోడు నియోజకవర్గంలోని ఓ ఫాంహౌజ్లో వ్యక్తిగతంగా ప్రైవేటు పార్టీ నిర్వహించారు. వాస్తవానికి ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం. అయితే ఈ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పలు అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యవహారంపై ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ పోలీస్ బాస్ కు ఫిర్యాదు చేశారని పోలీసు శాఖలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

దీనికి స్పందించిన ఆయన ప్రత్యేక టీమ్ను రంగంలోకి దించి అసలు విషయాన్ని ఆరా తీసే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఈ ఫాంహౌజ్ వ్యవహారంలో నిజం ఎంత ఉందన్న దానిపై స్థానికంగా పెద్ద చర్చే సాగుతోంది.. అయితే ఈ మొత్తం వ్యవహారం ఆధారంగా ఇంకా జిల్లాలో ఏ ఏ పోలీస్ అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయో అంటూ స్థానికంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నట్లు తెలుస్తుంది.  మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం పోలీస్ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది.