16 June, 2026 | 2:45 AM

గిరిజన గ్రామాలపై సవతి ప్రేమ!

16-06-2026 01:42 AM

ఏడాది క్రితం శంకుస్థాపన

నేటికీ ప్రారంభం గానీ పనులు 

గిరజన గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 15, (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై సవితి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకలపల్లి మండలంలో ఏడాది క్రితం హై లెవెల్ వంతెనల కోసం శంకుస్థాపన చేసిన, ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం విమర్శలకు అర్థం పడుతోంది.

ములకలపల్లి మండలం, సీతారామపురం గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడు, గుర్రాలకుంట, ధర్మన్ననగర్ గ్రామాలకు వెళ్లే మార్గంలో  మూడు హై లెవల్ వంతెనలను గత ఏడాది జూన్ మాసంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ములకలపల్లి మండలంలోని సీతారామపురం గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడు, గుర్రాలకుంట, ధర్మన్ననగర్ గ్రామాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం సుమారు రూ.5 కోట్ల వ్యయంతో మూడు హై లెవల్ వంతెనలు గత సంవత్సరం మంజూరు అయ్యాయి.

ఈ వంతెనల నిర్మాణ పనుల ప్రారంభం కోసం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారు శంకుస్థాపన చేసి శిలాఫలకాలు వెక్కిరిస్తూ దర్శనమిస్తున్నాయి. గత 30 నుంచి 40 సంవత్సరాలుగా ఈ నాలుగు గిరిజన గ్రామాల ప్రజలు వంతెనల నిర్మాణం కోసం స్థానిక అధికారుల నుంచి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వరకు అనేకసార్లు విజ్ఞప్తులు, ఫిర్యాదులు చేసిన ఫలితంగా నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం పనులు ప్రారంభించక పోవడంతో సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

శంకుస్థాపనతో సరి... పనుల ప్రారంభం ఎప్పుడు మరి..

శంకుస్థాపన జరగగానే ఈ గ్రామాల ప్రజలు తమ కష్టాలు తీరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయడంతో తమ కష్టాలు ఇంత కాలానికి తెర బోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వారి ఆనందం కేవలం శిలాఫలకాలతో సరి... పనులు ప్రారంభం ఎప్పుడు మరి అన్న చందాన మారడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు మహాప్రభో అంటూ ఆయా గ్రామాల గిరిజనులు వేడుకుంటున్నారు.

ఈ ఏడాది తప్పని తిప్పలే..

ప్రతి వర్షాకాలంలో ఈ నాలుగు గ్రామాలకు వెళ్లే మార్గంలోని మూడు కాలువలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా అన్నారం గ్రామం రెండు వైపులా ఉన్న కాలువల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించడం వల్ల కొన్నిసార్లు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు గ్రామం పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరద పరిస్థితుల కారణంగా గ్రామాల్లో అనారోగ్యానికి గురైన వారికి అంబులెన్స్ సేవలు అందకపోవడం, విద్యుత్ సరఫరా అంతరాయం కలగడం, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోవడం, కూలీ పనులకు వెళ్లే వారి ఉపాధి దెబ్బతినడం వంటి తీవ్ర ఇబ్బందులను గిరిజన ప్రజలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి ఈ మూడు హై లెవల్ వంతెనల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన 

ములకలపల్లి మండలంలో ఏడాదికృతం నిధులు మంజూరైన వాగులపై హై లెవెల్ వంతెన లు ప్రారంభించకపోవడం పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనియెడల ఈ నాలుగు గ్రామాల ప్రజలను మమేకం చేసుకొని బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు