16 June, 2026 | 3:30 AM

తొలిరోజు బడికి స్వల్పంగా హాజరు

16-06-2026 02:19 AM

మహబూబాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): విద్యా సంవత్సరం ప్రారంభం రోజున ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతం స్వల్పంగా నమోదయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు ప్రారంభించినప్పటికీ, చాలా చోట్ల అమావాస్య సెంటిమెంట్ కారణంగా పిల్లలను తొలిరోజు తల్లిదండ్రులు పాఠశాలకు పంపేందుకు ఆసక్తి చూపలేదు.

దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలకు 20 శాతం నుంచి విద్యార్థులు రాలేదు.  విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా పాఠశాలలను కొన్నిచోట్ల మామిడి తోరణాలు, ముగ్గులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాలకు తొలిరోజు వచ్చే విద్యార్థులకు ఘనంగా ఉపాధ్యాయులు స్వాగతం పలికారు.  మహబూబాబాద్ జిల్లాలో గత విద్యా సంవత్సరం మూతపడ్డ పాఠశాలలను తిరిగి తెరిపించడానికి స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ చూపారు.

ఫలితంగా రెండేళ్ల క్రితం మూతపడ్డ బాబు నాయక్ తండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తిరిగి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ భూక్య పార్వతి, డాక్టర్ ధరమ్సోత్ సీతారాం నాయక్,  రిటైర్డ్ ఉపాధ్యాయులు మైస శ్రీనివాసులు, షేక్ జానీ, పాఠశాల ఉపాధ్యాయురాలు దీప్తి, అంగన్వాడి టీచర్ వసంత, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పలుచోట్ల ప్రారంభం రోజున విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, దాతల సహకారంతో విద్యా సా మాగ్రి అందజేశారు. పలు జిల్లాల్లో ఎంపిక చేసిన కొ న్ని ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.