కుప్పకూలిన ఫతేనగర్ వంతెన మెట్లు.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్,(విజయక్రాంతి): సనత్‌నగర్ వద్ద మంగళవారం ఫతేనగర్ ఫ్లైఓవర్ వంతెన మెట్ల భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... 30 ఏళ్లకు పైగా పురాతనమైన ఫతేనగర్ ఫ్లైఓవర్ మెట్ల మార్గం నుంచి ఫతేనగర్ ఎంఎంటీఎస్ తో పాటు ఫ్లైఓవర్ కు రెండు వైపులా ప్రయాణికులు వెళ్తుంటారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాదచారుల మెట్లు తడిచి దెబ్బతిన్నాయి. పాదచారులు దానిపై ఉన్నప్పుడే అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మెట్లు వర్షపు నీటిని పీల్చుకుని కూలిపోయి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




