హత్య కేసులో తండ్రి కొడుకులకు జీవిత ఖైదు
ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా
కామారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): పదేళ్లుగా ఆస్తి, భూమి వివాదాల నేపథ్యంలో పాత కక్షతో అన్నను హత్య చేసిన తండ్రి కొడుకుల కు మంగళవారం కామారెడ్డి కోర్టులో న్యాయమూర్తి సాక్షులను విచారించిన పిదప జీవిత ఖైదు విధించడంతోపాటు ఒక్కొక్కరికి రూ. రెండువేల జరిమానా విధించారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బరంగేడికి చెందిన వడ్ల మారుతిని భూతాగాదాలతో 2 సెప్టెంబర్ 2018న అతని తమ్ముని కుమారుడు తో పాటు తమ్ముడు కలిసి తన తండ్రిని హత్య చేసినట్లు బీర్కూరు పోలీసులకు వడ్ల రాజకుమార్ ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల మధ్య చాలాకాలంగా ఆస్తి, భూమి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అదే కక్షతో వడ్ల సాయిలు తన అన్న వడ్ల మారుతిని మృదంగం మరమ్మతుల పేరుతో ఇంటికి పిలిపించగా, అక్కడ వడ్ల గజానంద్, అతని తండ్రి సాయిలు వడ్రంగి బాడిషతో తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం బాధితుడిని 108 అంబులెన్స్లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
పెద్దలు ఆస్తిని పంచిన సమయంలో వ్యవసాయ భూమి విషయంలో ఇరువురి అన్నదమ్ము ల మధ్య భూ వివాదం ఏర్పడింది. మృతుడు తన పేరిట 3 ఎకరాల వ్యవసాయ భూమిని పట్టా చేసుకోగా, అనంతరం నిందితుడి పేరిట 2 ఎకరాల భూమిని పట్టా చేయించారు. ఇంకా తనకు రావలసిన అర ఎకరం భూమిని ఇవ్వకపోవడంతో సుమారు 10 సంవత్సరాల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది.
ఆ సమయంలో నిందితుడు తన అన్నపై కేసు నమోదు చేయగా, అనంతరం కోర్టులో రాజీ చేసుకొని తనకు రావలసిన అర ఎకరం భూమిని ఇస్తానని మృతుడు చెప్పడంతో కేసును రాజీ చేసుకున్నారు. భూమి ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న ఆస్తి, భూమి వివాదాల నేపథ్యంలో అదే కక్షతో వడ్ల సాయిలు తన అన్న వడ్ల మారుతిని మృదంగం మరమ్మతుల పేరుతో ఇంటికి పిలిపించి, అక్కడ తన కుమారుడు వడ్ల గజానంద్తో కలిసి వడ్రంగి బాడిషతో తలపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇట్టి కేసులో సాక్షులను విచారించి, శాస్త్రీయ మరియు ఇతర సాక్ష్యాధారాలను సేకరించి నిందితులు వడ్ల గజానంద్ , వడ్ల సాయిలు లపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసులో సాక్షుల వాంగ్మూలాలు, సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిద నిందితులపై నేరం రుజువైనట్లు నిర్ధారించి, వడ్ల గజానంద్, వడ్ల సాయిలు ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000/- జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఈ కేసులో ప్రభుత్వ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్య ప్రసాద్ , కేసును శాస్త్రీయంగా దర్యాప్తు చేసిన అప్పటి బీర్కూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, అప్పటి ఎస్‌ఐ ఎం. సంపత్, ప్రస్తుత బీర్కూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఎస్‌ఐ రాములు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, సీడీవో మోహన్ సింగ్ ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఈ సందర్భంగా వారిని అభినందించారు.






