కందనూలు జిల్లాకు డెంగ్యూ ఫీవర్!
- పేరుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
- జనరల్ ఆసుపత్రికి క్యూ కడుతున్న రోగులు
- జిల్లాలో 11 డెంగ్యూ కేసులు నమోదు
- ప్రతి ఇంటా వ్యాధుల బారిన ఇద్దరు
- గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం
- ఈగలు, దోమల విజృంభన
- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు డెంగ్యూ భయం పట్టుకుంది. ప్రతి ఇంట సుమారు ఇద్దరికీ పైగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ మంచం పట్టారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చివరికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వైద్యులు అందుబాటులో లేక వైద్యం అందకపోవడంతో ప్రజలంతా జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చి చేరుతున్నారు.
సుమారు మూడు వేలకు పైగా ఓపి రోగులు వస్తున్నారని ఇందులో ఇన్ పేషెంట్లు 200 పైగా వైద్యం పొందుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా వ్యాధులు విధంబిస్తున్నాయి. చిన్నపాటి ముసురు వర్షాలకే గ్రామాల్లోని వీధులన్నీ కుంటలుగా మారి ఈగలు, దోమల వ్యాప్తికి కారణం అవుతున్నాయి.
పంచాయతీలకు తాజాగా నిధులొచ్చినప్పటికీ విద్యుత్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాలు ఒత్తిడి చేయడంతో ప్రస్తుతం పంచాయతీ పరిధిలో పనులు చేయలేక పారిశుధ్యం లోపిస్తుందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. పల్లెలకు కార్యదర్శులు కూడా చుట్టపు చూపుగా వచ్చి వెళుతుండడంతో వ్యాప్తి చెందిన దోమలు, ఈగలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయని మండి పడుతున్నారు. అచ్చంపేట కొల్లాపూర్ ప్రాంతం ఆయా మండలాల పరిధిలోని చెంచు పెంటల్లో విష జ్వరాలు తాండవిస్తున్నాయని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనిచేయని పల్లె వైద్యం.!
జిల్లా వ్యాప్తంగా 178 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 124 పల్లె దవఖానాలు, 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, మరో నాలుగు ఏరియా హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కేవలం కల్వకుర్తి, అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో మాత్రమే కొంతమేర వైద్యం అందిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా పేరుకే ఉన్నాయని వైద్యాధికారులంతా రాజకీయ అధికార బలంతో డుమ్మాకొడుతూ రోగులకు వైద్యం అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం రోగులకు బెడ్లు కూడా దొరికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కందనూలు జిల్లాకు డెంగ్యూ ఫీవర్..!
వైద్యాధికారుల అలసత్వం ప్రజా ప్రతినిధుల ప్రేక్షక పాత్ర వల్ల ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. ఇప్పటివరకు నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలో ఏడు డెంగ్యూ కేసులో నమోదు కాగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో మాత్రం 11 కేసులు నమోదయ్యాయి. దింతో పాటు మలేరియా ఒకటి, టైఫాయిడ్ 11 వైడల్ 19 కేసులు నమోదయ్యాయి.
గత పది రోజులుగా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 560 జ్వరం సర్వే బృందాలు జిల్లాలోని 80 వేలకు పైగా నివాసాల్లో సందర్శించి రెండు లక్షలఅందికి పైగా స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించారు ఇందులో 1000 కి పైగా కేసులు గుర్తించినట్లు తెలుస్తోంది ఇంకా ఏడు లక్షల మందికి పైగా సర్వే బృందాలు స్క్రీనింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యాధికారులంతా రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమకు అనుకూలమైన స్థానాల్లో బదిలీ చేయించుకుని విధులకు డుమ్మా కొడుతున్నప్పటికీ రాజకీయ నేతలు వెనకేసుకొస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు నమోదు అవుతున్న మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి పేద రోగులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






