15 April, 2026 | 4:17 AM

కల్వకుర్తిలో దొంగల భయం..!

29-12-2025 12:00 AM
  1. తాళం వేస్తే చాలు ఇంటికి కన్నం పడినట్లే.!
  2. కొరవడిన పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణ
  3. రిమాండ్ ఖైదీ పరారీలోనూ తేలని పురోగతి

కల్వకుర్తి, డిసెంబర్28: కల్వకుర్తి ప్రాంతాన్ని దొంగల భయం వెంటాడుతోంది. పండగలు, సెలవు దినాల్లో ఇంటికి తాళం వేసి పొరుగు గ్రామానికి వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి. చెమటోడ్చి కష్టపడి పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బు నగలను కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. పగటిపూట గస్తీ కాసి తాళం వేసిన ఇండ్లను వెతికి వాటినే లక్ష్యంగా వరుస దోపిడీకి పాల్పడుతూ సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సంఘటనలు కల్వకుర్తిలో నిత్యకృత్యంగా మారాయి.

ల్వకుర్తి పట్టణం, మండలంలోని సమీప గ్రామాల్లోనూ వరుసగా జరుగుతున్న దొంగతనాలు పోలీస్ వ్యవస్థకు బహిరంగ సవాల్గా మారుతున్నాయి. దొంగతనాలను నిలువరించేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ అదే స్థాయిలో దొంగలు కూడా చాకచక్యంగా వ్యవహరిస్తూ పోలీసులకు చిక్కకుండా దోపిడీకి పాల్పడి సులువుగా తప్పించుకుంటున్నారు.

సీసీ కెమెరాలు, మొబైల్ టవర్లను తప్పించుకునే విధంగా స్మార్ట్ ఫోన్ వాడకుండా అడుగులు వేస్తున్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని తేటతెల్లమవుతుంది. నిఘా వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేయడం లేదని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలుగు నాగిరెడ్డి అనే ఖైదీ కల్వకుర్తి ప్రాంతంలో జరిగిన దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఏడాది నవంబర్ 12న విచారణలో భాగంగా అతన్ని పీటీ వారె్ంప అనంతపూర్ జైలు నుంచి తీసుకొచ్చారు. విచారణ పూర్తికాకముందే పోలీసుల కళ్ళు కప్పి ఆ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. సుమారు 50 రోజులు కావస్తున్నా పరారైన ఆ ఖైదీ ఆచూకీ లభించకపోవడం పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం ఎత్తిచూపుతోంది. ఈ పరిస్థితిలో బాధితులు తమ పోగొట్టుకున్న సొత్తు తిరిగి దక్కుతుందనే ఆశ కోల్పోతున్న పరిస్థితి. 

పట్టుబడని దొంగలు

ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన దొంగతనాలు నేడు పల్లెల్లోనూ జరుగుతున్నాయి. పోలీసులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారుల వరకే గస్తీ పరిమితమై ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలనీలు, గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యం పాలవుతున్నాయనే విమర్శలున్నాయి. పట్టణంలోని సుభాష్ నగర్, టీఎన్జీవో కాలనీ, విద్యానగర్, వాసవి నగర్ వంటి కాలనీల్లో చోరిలు జరిగాయి.

కేశవ నగర్ లో ని పూజారి ఇంట్లో 57 తులాల బంగారు. రూ ,7లక్షల నగదు, చోరీ చేశారు. ఈ కేసులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక దొంగను అదుపులోకి తీసుకొని అతని నుండి 24 గ్రాముల బంగారు రూ, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకొని నిందితుని రిమాండ్ చేశారు. ఎన్జీవో కాలనీలో జరిగిన చోరీలో ఎలాంటి పురోగతి లేదు. ఎల్లికల్ గ్రామంలో మేకల చోరీ, సుభాష్ నగర్ లో గృహప్రవేశం రోజు జరిగిన చోరీ, ముకురాల గ్రామంలో జరిగిన రెండు కేసులు మార్చాలలో రెండీళ్లలో వరుస చోరీలు జరిగాయి. ఇప్పటివరకు ఆ కేసులకు సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

2022 సెప్టెంబర్లో జరిగిన మూడు చోరీల కేసులో 76 తులాల బంగారు సుమారురూ ,6 లక్షల నగదు అపహరించారు. ఆ కేసులు ఇప్పటికీ నిందితులు దొరకకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించి పాత నేరస్థులపై దృష్టి సారించి చోరీలు నియంత్రించి బాధితులకు భరోసానిచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు .