ఫెడరల్ బ్యాంక్ నికర లాభం రూ.906 కోట్లు
న్యూఢిల్లీ, మే 2: ప్రైవేటు రంగ ఫెడరల్ బ్యాంక్ 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ.906 కోట్ల స్టాండెలోన్ నికరలాభాన్ని కనపర్చింది. ఇది క్యూ3లో సాధించిన రూ.1,006 కోట్ల కంటే 11 శాతం తక్కువ. గత ఏడాది క్యూ4 కంటే (రూ.902 కోట్లు) స్వల్పంగా పెరిగింది. బ్యాంక్ షేరుకు రూ.1.20 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ఈ క్యూ4లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 1,909 కోట్ల నుంచి రూ. 2,195 కోట్ల కు చేరింది. బ్యాంకు డిపాజిట్లు 18.35 శాతం వృద్ధితో రూ.2,52,534 కోట్ల కు పెరిగాయి. అడ్వాన్సులు రూ. 2,09,403 కోట్ల వద్ద నిలిచాయి. ఇందులో రిటైల్ రుణాలు 20 శాతం వృద్ధితో రూ.67,435 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. స్థూల ఎన్‌పీ ఏలు 2.13 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.60 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. ప్రొవిజనల్ కవరేజ్ రేషియో (పీసీఆర్) 71.08 శాతం ఉన్నది.






