ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
- 8, 9 జీవోలతో బీసీలకు ఉరితాడు
- సచివాలయం ముట్టడించిన బీసీ సంఘాల నేతలు.. అరెస్ట్
- అరెస్టు అన్యాయమన్న జేఏసీ చైర్మన్ జాజుల, బీఆర్‌ఎస్ నేత సిరికొండ
ముషీరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ దశలవా రీగా రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, అందులో భాగంగానే జీవో 7ను రద్దు చేసినట్టే చేసి 8, 9 జీవోలను తెచ్చి బీసీలకు ఉరితాడు బిగించిందని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌చేశారు.
సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో పోలీసులు నేతలను అడ్డుకొని గోషామహల్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన బీసీ సంఘాల నేతల్లో బీ మనిమంజరి, కుళ్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్, కనకాల శ్యామ్, జాజుల లింగంగౌడ్, బొల్లిపల్లి స్వామిగౌడ్, పానుగంటి విజయ్‌గౌడ్, బూడిద మల్లికార్జున యాదవ్, మాదేశి రాజేందర్, తారకేశ్వరి, ఇంద్రం రజక, వరుణ్ కుమార్, మహేష్ మేరు, సంపత్ నాయుడు, మధుయాదవ్, గజ్జెల సత్యరాజ్ గౌడ్, అనంతుల సాయి తదితరులున్నారు.
వీరిని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ శాసనమండలి నేత సిరికొండ మధుసూదనాచారిలు పరామర్శించారు. అనంతరం పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
శాంతియుత నిరసనకు అక్రమ అరెస్టులు అన్యాయమన్నారు. 14 లక్షల మందికి రావాల్సిన 7 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పోరాటం న్యాయమైనదని, బీఆర్‌ఎస్ వెన్నుదన్నుగా నిలుస్తుందని మధుసూదనాచారి స్పష్టంచేశారు.






