విజయ తీరానికి ‘ప్రణమిల్లే పాదాలు’
వర్తమాన సమాజంలో జరుగుతున్న పరిణామాలకు స్పందిస్తూ, చక్కటి కవితల సంకనలంతో పాఠకుల ముందుకు వచ్చారు కవి సుధీర్ కుమార్ తేళ్లపురి. కవిత్వంలో నిత్య జీవిత అనుభవాలను, సామాజిక బాధ్యతను రంగరించి రచనలు చేయడం ఆయన ప్రత్యేకత. తన తాజా కవితా సంపుటి ‘ప్రణమిల్లే పాదాలు’. ఈ కవితల సంకలనం చదివాక సమీక్ష రాయాలనిపించింది.
కావాలని కాదు.. మనసు స్పందించడంతోనే సమీక్ష రాస్తున్నా. కవి ఒక చోట అంటాడు ‘మనిషి మంచి నడవడిక, కొత్త ఆలోచనలతో గెలుపు వైపు అడుగులు వేస్తే నాచు పట్టిన దారి సైతం పువ్వుల వనంలా మారుతుంది, పరిమళాలు వెదజల్లుతూ స్వాగతం పలుకుతుంది. గాఢ నిద్రలో ఉన్న సమాజాన్ని తట్టి మేల్కొలుపుతూ జీవితంలో ఒడిదుడుకులకు అదరకుండా మార్పు కోసం ముందుకు సాగితే అభివృద్ధి పథంలో పయనిస్తాం’ అని ప్రస్ఫుటించారు.
తొలి కవితలో నాన్న గురించి తెలుపుతూ ‘ఆరు పదుల వయస్సు వచ్చినా యం త్రంలా పనిచేస్తున్న నాన్న పాదాలకు ప్రణమిల్లుతా’ అని సగర్వం చాటారు. చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన నాన్న తన బాధ్యతలతో కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేశాడని కవితలో కొనియాడారు. ‘పచ్చటి అరణ్యంలో చిచ్చు రాజుకుంటే అది దావాగ్నిలా మారు తుంది’ అంటూ బడుగుల బతుకులకు భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
‘మనసుకు దగ్గరైన వారితో విరోధం.. ప్రాణం లేని జీవశ్ఛవంతో సమానం’ అంటారు ఒకచోట. మానవాళి చిన్న చిన్న మనస్పర్థలతో బంధాలను దూరం చేసుకోకూడదని తన కవిత ద్వారా సూచించారు. ‘సంప్రోక్షణ’ అనే కవితలో భార్యపై ఉన్న మమకారాన్ని తెలుపుతూ.. ఆమె పుట్టింటికి వెళ్లినప్పుడు అనుభవించిన ఒంటరితనాన్ని ప్రకృతితో పోల్చారు. శాంతి కోసం పావురాలు ఎగురవేయాలని, యుద్ధంతో అమాయక ప్రజలే ఇబ్బందులు పడతారని కవి చాటిచెప్పారు. నేలను నమ్ముకున్న రైతన్న మనుగడ కష్టమై ఆ మట్టి లోనే కలిసిపోతున్నాడని కవి ఓ కవితలో ఆవేదన చెందారు.
‘కడదాకా జ నం కోసమే సమరం సాగిస్తూ గర్వం గా నేలకొరిగే కళా యోధుడతడు’ అం టూ అభాగ్యుల హక్కుల కోసం నిత్యం వెలిగే సూర్యుడు వేగుచుక్క అని కొనియాడారు. లేత చిగురులా పసివాడి ఎదుగుదల, లక్ష్యం వైపు పరుగు, భావి భారత పౌరులుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఏ మత గ్రంథమైనా మానవత్వమే బోధిస్తుందని ‘ప్రబోధం’ కవితలో లిఖించారు. ‘నిప్పు కణికలు’ లో విప్లవ కవి శ్రీశ్రీ కవితాధాటిని కొనియాడారు. వార్ధక్యంలోనూ తోడు నీడలా ఉన్నవాళ్లలో ఒకరు దూరమైనప్పుడు అనుభవించే బాధను తెలుపుతూ.. భార్య చేసే సేవలు తలుచుకుంటూ ఏకశిలా స్తంభంలా నిలిచిపోవాలని కవిత్వీకరించారు.
పసిపిల్లల అమాయకత్వం, కల్మషం లేని చిరునవ్వును తెలియజేస్తూ నేటి కార్పొరేట్ విద్యలో అందమైన బాల్యం బందీ అవుతోందని, చిన్నారులకు సమాజంలో రక్షణ లేదని ఆవేదన చెందారు. చివరి కవిత ‘ప్రక్షాళన’లో ఖాళీ సమయంలో మది గదికి ఈర్ష్యా ద్వేషాల బూజు పట్టకుండా కవిత్వంతో ప్రక్షాళన చేసుకుంటానని సంకలనాన్ని ముగించారు. మొత్తానికి కవి తన సంకలనం ద్వారా సమాజంలో మంచిని స్వాగతిస్తూ చెడు నిర్మూలనకు కృషి చేయాలని పాఠకులకు పిలుపునిస్తారు. హృదయానికి హత్తుకునే కవిత్వం చదవాలనుకునే పాఠకులకు ఈ సంకలనం ఒక చక్కటి చాయిస్.
మిద్దె సురేష్
సమీక్షకుడు






