10 August, 2026 | 2:33 AM

ప్రాణం నిలిపిన వాన

10-08-2026 01:09 AM

అడవిని కమ్మేసిన కారుమేఘాలు

మదపుటేనుగుల్లా కుంభస్థలాలతో

తలపడుతుంటే ఎక్కడి నుంచో

 చక్కలిగింతల గాలి

వటగట్టుకొచ్చిన చినుకులు నేల తడిసేలా

దులపరించి పోయింది

తడిసిన మట్టి వాసనల మాధుర్యం 

అడవంతా వ్యాపించింది..

చూస్తుండగా చినుకుల జోరు 

హెచ్చి జడివానగా

మారి పచ్చదనానికి తలంటు పోయసాగింది..

ఒడిలో తాండవమాడుతున్న చినుకుల

నృత్యరూపకానికి అడవి వేదికయ్యింది..

పక్షులు, జంతువులది ప్రేక్షకపాత్ర

వర్షంలో తడిసి ముద్దయ్యాక పచ్చని మేనుపై

ధగ ధగల చినుకు ఆభరణాలు తడుముకొని

మురిసిపోతూ తానే 

వానై కురవసాగింది అడవి..

ఏకాంతాన్ని భగ్నం చేస్తేనేం, అరణ్యం పచ్చని

ముగ్ధత్వానికి తుది మెరుగులు దిద్దింది వాన!

గుబురు చెట్లలో గూళ్లల్లుకొన్న పక్షులు,

నక్కిన జంతువులు వానపాట ఎప్పుడు

ముగుస్తుందా అని చూస్తున్నాయి

వర్షం ఆగితే వాటికెన్నో 

రాచకార్యాలున్నాయి..మరి..

జింకను చూసిన పులి, వర్షానికి వేటాడ్డం

మానేసి పొదల్లో ముడుచుకు కూర్చుంది

బతుకు జీవుడా! అని జింక వర్షానికి

కృతజ్ఞతలు చెప్పి చినుకుల కంటే వేగంగా

అదృశ్యమైపోయింది..!

భీమవరపు పురుషోత్తమ్