తెలంగాణ ఉద్యమ దివ్యాంగులకు సన్మానం
చైతన్యపురిలో వంద మందికి ఆత్మీయ సన్మానం
ఎల్బీనగర్, జూన్ 9 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న దివ్యాంగులను తెలంగాణ ఉద్యమకారులు సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల పాత్ర ఆత్మగౌరం ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మంగళవారం ఉద్యమకారుడు సత్యనారాయణగుప్తా ఆధ్వర్యంలో 100 మంది దివ్యాంగులను చైతన్యపురిలోని శివాజీ చౌక్ దగ్గర శోభన్ రెడ్డి, ఉద్యమకారుల గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు శోభన్ రెడ్డి తదితరులు సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.
2009 నుంచి 2014 వరకు ఉద్యమంలో పాల్గొన్న దివ్యాంగులకు గుర్తింపు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల రాజ్యాధికార ఫోరం అధ్యక్షుడు వంశరాజ్ రామచంద్ర మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే వికలాంగులకు ఉద్యోగం ఉపాధి సమాజంలో గౌరవం దక్కుతుందని ఆశపడ్డామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఇంత కష్టపడితే అప్పటి సీఎం కేసీఆర్ దివ్యాంగులను దూరం పెట్టారని ఆరోపించారు.
33 సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖని మహిళా శాఖలో విలినం చేసి మమ్మల్ని ఇంకా దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, వికలాంగ సంక్షేమ శాఖని ప్రత్యేక అధికారులతో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, పింఛను రూ, 6వేలకు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు.
దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు బి.రామచంద్రయ్య, నాగభూషణం, నర్సింహ, రాంబాబు, గుర్రం రమేశ్, కుర్షిత్, ఆంజనేయులు, బండి శీను, భాస్కర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.






