13 June, 2026 | 2:33 AM

రైతుల కోసం అందుబాటులో ఎరువులు

13-06-2026 01:24 AM
  1. 1లక్షా 26 వేల ఎకరాలకు 13వేల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం
  2. షాద్ నగర్ నియోజకవర్గ వ్యవసాయ శాఖ సమీక్ష 
  3. సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్ నగర్ జూన్ 12 (విజయక్రాంతి): వర్షాకాలం వచ్చిన సమయంలో కొత్త పంటల కోసం ముస్తాబయ్యే రైతులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారులు వాటిని అన్నదాతల వరకు చేర వేసే విషయంలో అండగా ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు.  శుక్రవారం పట్టణంలోని తన స్వగృహంలో వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కువగా నిరక్షరాస్యులే ఉంటారని, వారికి యాప్ ద్వారా సబ్సిడీ ఎరువులు, పొటాషియం, డిఏపి, కాంప్లెక్స్ ఎరువుల వంటివి దరఖాస్తు చేసుకోవడం తెలియదని వివరించారు.

అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఈ విడత యాప్ ద్వారా కాకుండా నేరుగా చెల్లింపులు జరిగేలా తాను ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఈ యాప్ ను ప్రచారంలోకి తీసుకువచ్చి రైతులకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ విషయంలో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను నివారించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో తాను ఎప్పటికప్పుడు ఈ వ్యవసాయ సీజన్లో సంప్రదింపులు జరుపుతానని స్పష్టం చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలో 1 లక్షా ,26 వేల ఎకరాలలో వ్యవసాయం కొనసాగుతుందని, వరి, మొక్కజొన్న, పత్తితో పాటు ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారని వివరించారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరాన్ని బట్టి ఎరువులు, ఇతర వస్తువులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన మీడియాకు వివరించారు.

ప్రస్తుతం 13 వేల మెట్రిక్ ట న్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, 6000 మెట్రిక్ టన్నుల డిఏపి, 9,000 మెట్రిక్ టన్నుల పొటాష్, 1000 మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. మండలాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారు ప్రభుత్వ సదుపాయాలు అందుకునేలా చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు.  వ్యవసాయ శాఖ ఏడి రమాదేవి,అన్ని మండలాల ఏవోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.