20 August, 2026 | 8:46 PM

ఆర్టీసీ పరిరక్షణకు పోరాటమే మార్గం

02-09-2025 12:00 AM

ఎంప్లాయీస్ యూనియన్ సభలో దండి సురేష్

ఖమ్మం, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అస్తిత్వమే ప్రమాదంలో పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. ఆర్టిసి పరిరక్షణకు హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి ప్రైవేటీకరణ దిశగా ఆలోచన చేయడం శోచనీయమన్నారు. ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం డిపో కమిటీ సమావేశం సోమవారం స్థానిక గిరిప్రసాద్ భవన్లో జరిగింది.

పిల్లి రమేష్ అధ్యక్షతన జరిగిన సభలో దండి సురేష్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో క్రమేపి ప్రైవేటీకరణకు అవకాశం కల్పిస్తుందని ఇప్పటికే కొన్ని డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారు. ఆర్టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదని, ఆర్టిసి కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బకాయిలు, డిఏ, ఇతర ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రభుత్వం తక్షణం పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టిసిలో ఎన్నడులేనివిధంగా వేధింపుల పర్వం ప్రారంభమైందని కార్మికులను వేధిస్తే సహించబోమన్నారు. ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బిఎస్డ్డి, డిపో అధ్యక్షులు జగన్నాథం, కార్యదర్శి బుచ్చిబాబు, డిపో ఛైర్మన్ సిహెచ్ రమేష్, డిపో కోశాధికారి వెంకన్న, నాయకులు ఆదిలక్ష్మి, సుల్తానా, రమాదేవి, నాగమణి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దండి సురేష్ను ఘనంగా సన్మానించారు.