16 May, 2026 | 7:08 AM

సినీ నటి, నిర్మాత కృష్ణవేణి ఇక లేరు

17-02-2025 12:34 AM

అలనాటి నటి, నిర్మాత సీ కృష్ణవేణి (101) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.  1924, డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్‌లోని పంగిడిగూడంలో డాక్టర్ ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించిన కృష్ణవేణి నటిగా, గాయనిగా, నిర్మాతగా తెలుగు చలనచిత్ర రంగానికి వన్నె తెచ్చారు. సినిమాల్లోకి రాక ముందు రంగస్థల నటి కాగా 1936లో ‘సతీ అనసూయ’ చిత్రం ద్వారా దర్శకుడు సీ పుల్లయ్య ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. కథానాయకిగా 15 తెలుగు చిత్రాల్లో నటించారు.

మరికొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లోనూ కథానాయికగా మెప్పించారు. తన భర్త, నిర్మాత మీర్జాపురం రాజాతో కలిసి పలు సినిమాలు నిర్మించిన కృష్ణవేణి సొంతంగా కూడా సినిమాలు నిర్మించారు. తన సినిమాల్లో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపద గీతాలకు పెద్దపీట వేశారు. తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన మన దేశం (1949) చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ను, ఎస్వీ ఆర్‌ను, నేపథ్య గాయకుడిగా ఘంటసాల వేంకటేశ్వర రావును చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిదే. తన భర్త స్థాపించిన సంస్థ జయా పిక్చర్స్ (శోభనాచల స్టూడియోస్) బ్యానర్‌లో సినిమాలు తీయడమే కాకుండా తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీఅనూరాధ పేరు మీదుగా ఎంఆర్‌ఏ ప్రొడక్షన్స్‌ను సొంతంగా స్థాపించి నిర్మాతగా ప్రతిభ చాటారు. కృష్ణవేణి సినిమాల్లో ‘మనదేశం’, ‘లక్ష్మమ్మ’, ‘దాంపత్యం’, ‘గొల్లభామ’, ‘భక్త ప్రహ్లాద’ చెప్పుకోదగ్గవి. 

ప్రముఖుల సంతాపం.. 

కృష్ణవేణి మరణ వార్త విని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, నటుడు బాలకృష్ణ, మంచు విష్ణు సంతాపం ప్రకటించారు. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కృష్ణవేణికి నివాళ్లు అర్పించాయి.