16 May, 2026 | 7:54 AM

వేసవిలో సెట్స్‌పైకీ..

17-02-2025 12:30 AM

‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ ఏ హీరోతో సినిమా చేస్తాడనే విషయమై సినీప్రియుల్లో ఇంత కాలం ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సస్పెన్స్‌కు తెర తీస్తూ ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూరి మళ్లీ హీరో గోపీచంద్‌తో చేతులు కలపనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మూవీ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తోంది. స్టోరీ లాక్ అవ్వడంతో సమ్మర్ తర్వాత ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని పూరి ప్లాన్ చేస్తున్నాడట. పూరికి స్క్రీన్ ప్లే రాయడం అన్నది తొలి నుంచి అలవాటు లేదు. మధ్యలో మూడు నాలుగు సినిమాలకు స్క్రీన్ ప్లే రాశాడు. కానీ గోపీచంద్ చిత్రానికి మాత్రం పాత పద్ధతినే అనుసరిస్తూ స్టోరీ, డైలాగ్‌లే రాసుకొంటున్నట్టు టాక్. ప్రస్తుతం పూరి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఓ యువ నిర్మాత నిర్మించడానికి ముందుకొచ్చాడట. ఇక గోపీచంద్ ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్‌రెడ్డితో కూడా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ స్టోరీ లాక్ అయినట్టు, శ్రీనివాస్ చుట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూరి సినిమాతోపాటు గోపీచంద్ ఈ సినిమానూ పట్టాలెక్కించే అవకాశం ఉంది.