అపార్ట్‌మెంట్లలో ‘అక్షర’ పంజరాలు!
చదువుల పేరుతో ‘మాఫియా’
పుట్టుకొస్తున్న అనుమతుల్లేని బడులు
నియోజకవర్గంలో ‘పాఠశాలల’ అక్రమ దందా
ఆటకు స్థలం లేదు.. పాఠానికి గాలి లేదు
పసిపిల్లల ప్రాణాలతో విద్యాశాఖ చెలగాటం
యేటా పండుగ చేసుకుంటున్న అధికారులు
రంగారెడ్డి/ఎల్బీనగర్, జూలై 23 (విజయక్రాంతి): నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే చాలు... విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. కానీ, విద్యాశాఖలోని కొంతమంది అధికారులకు, ఏజెంట్లకు మాత్రం ఇది కాసుల వర్షం కురిపించే ’పండుగ సీజన్’. విద్యను పవిత్రమైన సేవగా చూడాల్సిన చోట... అదొక నిలువు దోపిడీ వ్యాపారంగా మారిపోయింది.
ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని సరూర్ నగర్, హయత్ నగర్, బాలాపూర్ మండలాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల పేరుతో సాగుతున్న అక్రమ దందా ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. పుట్టగొడుగుల్లా ’ప్లే, కిడ్స్, ఫ్రాంచైజీ’ స్కూళ్లు పుట్టుకొస్తున్నాయి. గల్లీకో ఇల్లు... వీధికో అపార్ట్మెంట్! కనీసం గాలి, వెలుతురు సరిగా రాని ఇరుకు గదులు, కమర్షియల్ కాంప్లెక్స్లలో ‘ఇంటర్నేషనల్‘, ‘కో-ఎడ్యుకేషన్‘, ‘టెక్నో‘ అనే మెరుగైన పేర్లతో ప్లే స్కూళ్లు, కిడ్స్ స్కూళ్లు, ఫ్రాంచైజీ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలు స్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
పాఠశాలకు సొంత లేదా లీజు భవనం ఉండి, విశాలమైన తరగతి గదులు ఉండాలి.పిల్లలు ఆడుకోవడానికి ఖచ్చితంగా ఆటస్థలం ఉండాలి. అగ్నిమాపక శాఖ అనుమతి, భవన దృఢత్వ సర్టిఫికెట్ తప్పనిసరి. సురక్షితమైన తాగునీరు, బాలబాలికలకు వేర్వేరు మూత్రశాలల సౌకర్యం ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఈ నిబంధనల్లో ఒక్కటి కూడా అమల్లో లేదు. అగ్నిప్రమాదం జరిగితే బయటకు పరిగెత్తడానికి కూడా దారి లేని ఇరుకు సందుల్లో వందలాది మంది పసిపిల్లలను బంధించి చదువు చెప్తున్నారు. ప్రాణాపాయం పొంచి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?
అగ్నిప్రమాదం లాంటి అత్యవసర పరిస్థితి తలెత్తితే మెట్లు కూడా దిగడానికి వీల్లేని ఇరుకు సందుల్లో ఈ పాఠశాలలు నడుస్తున్నాయి. పసిపిల్లల ప్రాణాలు తృటిలో ప్రమాదంలో పడే అవకాశం ఉన్నా విద్యాశాఖ అధికారులు కనీసం కన్నులయినా తెరవడం లేదు.తనిఖీల పేరుతో అధికారులు ఏటా ’పండుగ’ చేసుకుంటున్నారు. మామూళ్లు తీసుకుని అనుమతులు లేని స్కూళ్లకు సైతం పరోక్షంగా సహకరిస్తున్నారు. విద్యాశాఖ ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేదెవరు? అని స్థానిక విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.






