24 July, 2026 | 12:46 AM

మున్సిపాలిటీలలో.. అక్రమ నిర్మాణాల జోరు

24-07-2026 12:00 AM
  1. పరిశ్రమల షెడ్లకూ అనుమతులు లేవు 
  2. అధికారులతో మాట్లాడుకొని కొనసాగిస్తున్న పనులు 
  3. తూతూ మంత్రంగా నోటీసులు 
  4. మున్సిపల్ ఆదాయానికి గండి 

మేడ్చల్, జూలై 23 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నివాస గృహాలతో పాటు పరిశ్రమల షెడ్లు సైతం అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయానికి భారీగా గండిపడుతోంది. జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మూడూ కొత్తగా ఏర్పడ్డాయి.

కొత్తగా ఏర్పడిన ఈ మూడు మున్సిపాలిటీలలో నిధుల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినప్పటికీ నిధులు కేటాయించలేదు. దీంతో మున్సిపాలిటీలకు నిధులు లేక అభివృద్ధి పనులు చేపట్ట లేకపోతున్నారు. కనీసం సిబ్బంది వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆదాయ మార్గాలు అన్వేషించవలసిన బాధ్యత అధికారులు, పాలకవర్గాల మీద ఉంది.

కొత్తగా ఆదాయ మార్గాలను అన్వేషించకుండా వచ్చే ఆదాయాన్ని కూడా మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయలేకపోతున్నారు. హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతాలైన ఈ మూడు మున్సిపాలిటీలలో గృహ నిర్మాణం, పరిశ్రమల సంబంధించిన షెడ్లు నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ వీటికి అనుమతులు తీసుకోవడం లేదు. ఫలితంగా మున్సిపాలిటీలకు ఆదాయం రావడం లేదు. నిర్మాణదారులు టౌన్ ప్లానింగ్ అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి నిర్మాణ పనులు చేసుకుంటున్నారు.

అధికారులను,  ప్రజాప్రతినిధులను కలిసినందున అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వారు లేరు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నోటీసు ఇచ్చాం అనే సమాధానం మాత్రమే వస్తోంది. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఒక మున్సిపల్ కమిషనర్ ఏకంగా తనకు సంబంధం లేదని ఫిర్యాదుదారులకు సమాధానం ఇస్తున్నాడు.

మున్సిపాలిటీ పరిధిలో జరిగే వ్యవహారాలకు తనకు సంబంధం లేదు అనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. కొత్తగా మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటైన అక్రమ నిర్మాణా లను అడ్డుకోవడం లేదు. అంతేగాక మున్సిపల్ సిబ్బంది కొందరు పాలకవర్గాల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాజ్ బొల్లారంలో భారీ షెడ్డు నిర్మాణం.. 

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజ్ బొల్లారం వార్డు కార్యాలయం పక్కన భారీ షెడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు తీసుకోకుండా దర్జాగా నిర్మాణం కొనసాగిస్తున్నారు. దీనిపై అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. నిర్మాణదారుడుకి పనులు ఆపాలని మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ పనులు కొనసాగుతున్నాయి.

ఎల్లంపేటలో టౌన్ ప్లానింగ్ అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ అధికారి మరో రెండు మున్సిపాలిటీలలో విధులు నిర్వహిస్తున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీకి శుక్ర, శనివారాలు వస్తారు. ముఖ్యమైన విభాగానికి ఇన్చార్జి అధికారి ఉండడం వల్ల అక్రమ నిర్మాణదారులకు కలసి వస్తోంది. 

షెడ్డు కు అనుమతి లేదు 

రాజు బొల్లారం వార్డు కార్యాలయం పక్కన షెడ్డు నిర్మాణానికి మున్సిపల్ అనుమతి లేదు. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే నోటీసు జారీ చేశాం. శుక్రవారం ఎల్లంపేట మున్సిపాలిటీకి వస్తున్నాను. రికార్డులు పరిశీలిస్తాం. అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేస్తాము.

 మహేష్ చంద్రకాంత్, 

ఎల్లంపేట టౌన్ ప్లానింగ్ అధికారి