7 July, 2026 | 9:26 PM

ప్రతిభకు పబ్లిక్ క్లబ్ చేయూత

07-07-2026 08:06 PM

* ఐఐఐటీ విద్యార్థినికి రూ.28 వేల ఆర్థిక సాయం

అచ్చంపేట: అచ్చంపేట పట్టణానికి చెందిన ప్రతిభావంతురాలు, నిరుపేద విద్యార్థిని రింగు కావ్య శ్రీ తండ్రి రింగు రవి ఉన్నత విద్యాభ్యాసానికి అచ్చంపేట పబ్లిక్ క్లబ్ చేయూతనిచ్చింది. పదో తరగతిలో 563 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన రింగు కావ్యశ్రీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్  అండ్ టెక్నాలజీస్ బాసర క్యాంపస్‌లో ఐఐఐటీ సీటు సాధించడం పట్ల క్లబ్ కార్యవర్గం అభినందనలు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె ఉన్నత విద్య కొనసాగింపులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించిన పబ్లిక్ క్లబ్ కార్యవర్గం సమావేశంలో విద్యార్థినికి క్లబ్ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

అదనంగా, కార్యవర్గ సభ్యులు తమ వ్యక్తిగత విరాళాల రూపంలో మరో రూ.18 వేలు అందజేయడంతో మొత్తం రూ.28 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి కనోజు మనోహర్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతిభకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం అందించామని తెలిపారు. సమాజంలో ఉన్న దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు కూడా ఇలాంటి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.  కార్యవర్గ సభ్యుల సేవాభావం, ఉదారత పట్ల క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయాన్ని పట్టణ ప్రముఖులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు అభినందించారు.