18 May, 2026 | 3:34 AM

మోదీది స్వదేశీ నినాదం.. విదేశీ వ్యామోహం

18-05-2026 02:34 AM
  1. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు 
  2. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సిపిఎం నిరసన    

భద్రాద్రి కొత్తగూడెం, మే 17, (విజయక్రాంతి): ప్రధానమంత్రి మోడీది స్వదేశీ నినాదం విదేశీ వ్యామోహం అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఆదివారం ఆటో కి తాడు కట్టి లాగుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ తాను వేసుకునే కోట్లు, తాగే నీళ్లు, చేతికి పెట్టుకునే వాచి విదేశీ  వస్తువులు వాడుతూ, ప్రజలకు మాత్రం స్వదేశీ నినాదం ఇస్తున్నారని, మోడీ గారి స్వదేశీ నినాదం పొదుపు సూత్రాలు సామాన్య ప్రజలకేనా , ఆయనకు వర్తించవా అంటూ ప్రశ్నించారు. 

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం ప్రజలపై నేరుగా పడుతుందనీ, గ్యాస్ ధరల పెంపుతో ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్యాస్ ధరలను రెండు దఫాలుగా పెంచిందని విమర్శించారు. ఈ ధరల పెంపు దేశ ఆర్థిక వ్యవస్థపైనా, సామాన్య ప్రజానీకంపైనా తీవ్ర భారాన్ని మోపుతుందని తెలిపారు. ఇరాన్- అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతున్నది కాబట్టి పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ చూపడం విడ్డూరంగా ఉందన్నారు. .

నేరం చేసేవాడు ఒకడైతే ప్రజలకు శిక్ష వేసే పరిస్థితి నేడు నెలకొందన్నారు.  అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఆగితే ఈ ధరలు పెంచాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే, ప్రధాన మంత్రి మోడీ యుద్ధ నివారణ చర్యలు తీసుకోకుండా, అమెరికాకు దాసోహం అయిపోయి ట్రంప్కు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రజలు మాత్రం ధరల భారాలను భరించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ లిక్కి బాలరాజు రేపాకుల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్  తదితరులు పాల్గొన్నారు.