15 April, 2026 | 10:11 AM

11,460 కోట్లతో ఆర్థిక ప్రణాళిక

01-02-2026 03:01 AM
  1. జీహెచ్‌ఎంసీ మెగా బడ్జెట్‌ను ఆమోదించిన కౌన్సిల్  
  2. విలీన మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  
  3. గత ఏడాది కంటే రూ. 745 కోట్లు పెరుగుదల
  4. రెవెన్యూ ఆదాయ లక్ష్యం రూ.6,441 కోట్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి): నగర అభివృద్ధికి దిక్సూచిగా భావించే గ్రేటర్ హైదరాబాద్ మున్సిప ల్ కార్పొరేషన్ 2026- ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్ష తన జరిగిన స్పెషల్ కౌన్సిల్ సమావేశం రూ. 11,460 కోట్ల భారీ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025--26 కేటాయింపులతో పోలిస్తే ఈసారి బడ్జెట్ పరిమాణం రూ. 745.27 కోట్లు పెరగడం గమనార్హం.

నగరంలో కొత్త గా విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల అవసరాలు, మౌలిక వసతుల కల్పనను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. సమావేశం ప్రారంభంలో మేయర్ విజయలక్ష్మి కొంత భావో ద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుత పాలక మండ లికి ఇది చివరి కౌన్సిల్ సమావేశం కావడంతో ఆమె సభ్యులను ఉద్దేశించి మా ట్లాడారు. అనంతరం కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ బడ్జెట్ ముసాయిదాను ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ సభ్యులు దీనిని కాపీ పేస్ట్ బడ్జెట్‌గా అభివర్ణించగా, పెరిగిన విస్తీర్ణానికి ఈ కేటాయిం పులు ఏమాత్రం సరిపోవని విమర్శించారు. ఎంఐఎం సభ్యులు శానిటేషన్, స్ట్రీట్ లైట్ల నిర్వహణకు మరిన్ని నిధులు కావాలని కోరారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ సామల హేమ గత ప్రభుత్వ హయాం లో జరిగిన సీఆర్‌ఎంపీ అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, ప్రస్తుత కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సభ్యులు జగదీశ్వర్ గౌడ్ గ్రీన్ బడ్జెట్ ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. ఇటీవలే జీహెచ్‌ఎంసీ లో విలీనమైన 27 మున్సిపాలిటీల అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఈ బడ్జెట్ రూపొందించినట్లు కమిషనర్  వివరించారు. పునర్వి భజన ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, ఎక్కడా అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతో అహర్నిశలు శ్రమించి ఈ ముసాయి దాను సిద్ధం చేశామన్నారు.

గతంలో ఆస్తి పన్ను వసూళ్లు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఈసారి అంచనాలు తక్కువగా చూపడంపై విపక్షాలు క్లారిఫికేషన్ కోరాయి. సభ్యుల ప్రశ్నలకు సరైన వివరణ రాకముందే, మధ్యాహ్నం మేయర్ బడ్జెట్‌ను ఆమోదిస్తూ సమావేశాన్ని ముగించారు. కౌన్సిల్ ఆమోదం పొందిన ఈ బడ్జెట్ ప్రతిపాదనలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపను న్నారు. ప్రభుత్వం దీనిని పరిశీలించి తుది ఆమోదం తెలిపిన తర్వాత, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి రానుంది.