మద్యంతాగితే 10,000 జరిమానా... పట్టిస్తే 5000 నజరానా
బోథ్,ఆగస్ట్22(విజయక్రాంతి): బోథ్ మండలంలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామమైన నాగపూర్ గ్రామం(Nagpur village) అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అయితే గ్రామంలోని యువకులు మద్యానికి బానిసలు కావడంతో గ్రామ పెద్దలంతా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మద్యం సేవించడం వల్ల ఎదురవుతున్న అనర్థాలను గుర్తించారు. నాటు సారా తోపాటు మద్యం విక్రయాలపై కట్టడి చేశారు.
యువతరం మత్తులో చిత్తు
గ్రామంలోని యువకులు చదువులకు స్వస్తి పలికి వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో తాగుడికి బానిసలుగా మారారు. అయితే మద్యం మహమ్మారి నుండి గ్రామ యువకులను కాపాడాలంటే మద్యం తయారుచేసిన విక్రయించిన సేవించిన వారికి 10000 రూపాయల జరిమానా విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రోజంతా కొంతమంది యువకులు మద్యం కి బానిస కావడంతో గమనించిన పెద్దలు మద్యంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది యువకులు పొలం పనులకు వెళ్లకుండా గ్రామంలో ఉంటూ గొడవలకు కారణం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పచ్చని సంసారంలో చిచ్చు
యువకులు ముత్యానికి బానిసకావడం వల్ల పచ్చని సంసారాల లో చిచ్చు రేగింది. ఫలితంగా మద్యం మానిపించాలన్న దృక్పథంతో గ్రామస్తులు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మద్యం తాగిన పక్క గ్రామానికి వెళ్లి తాగి వచ్చిన జరిమానాలను విధిస్తామని తీర్మానించారు. దీంతో యువకులు మద్యానికి దూరమై వారి పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు.






