16 July, 2026 | 12:44 AM

హస్తినాపురంలో అగ్నిప్రమాదం

16-07-2026 12:00 AM

ప్లాస్టిక్ గోదాంలో అర్ధరాత్రి ఘటన

రోడ్డున పడ్డిన ౫ కుటుంబాలు 

బాధితులకు సుధీర్ రెడ్డి పరామర్శ 

ఎల్బీనగర్, జులై 15: హస్తినాపురం డివిజన్, మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం, శ్రీ రమణ కాలనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంతో రాత్రి సమయంలో స్థానికులను భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... శ్రీరమణ కాలనీలో మెట్రో బార్ ఎదురుగా ఉన్న ప్లాస్టిక్, పాత సామాన్ల గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

మంటలు క్షణాల్లోనే గోదామ్ పక్కనే ఉన్న శ్రీనివాస్ (40) ఇంటిని చుట్టుముట్టాయి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ఎస్‌ఈడీ టీవీ, గృహోపకరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో పాటు మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతింది. సుమారు రూ, 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఓగ్గు కథలు చెప్పడం, అమ్మవారి పూజలు నిర్వహించడం ద్వారా జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ కుటుంబం అగ్ని ప్రమాదంతో రోడ్డున పడింది. ఈ భవనంలో మొత్తం ఏడు కుటుంబాలు నివసిస్తున్నారు.

సామగ్రి అంతా అగ్నికి ఆహుతికావడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఏడు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్లాస్టిక్, పాత సామాన్లు పెద్దఎత్తున నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.  అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలను ఇతర ఇళ్లకు వ్యాపించకుండా ఆర్పివేశారు.  అగ్నిప్రమాదంపై మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు.  శ్రీ రమణ కాలనీలో చాలాచోట్ల పాత సామాన్ల గోదాంలు కొనసాగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. - బాధితులకు అండగా ఉంటాం - ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ హస్తినాపురం డివిజన్ పరిధిలోని శ్రీరమణ కాలనీలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

పరిస్థితిని సమీక్షించడంతోపాటు సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించడం జరిగింది. గోదాం పక్కన ఉన్న ఇంట్లో వస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోవడంతో ఆ ఇంటిని సైతం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఇండ్ల మధ్యలో ఇలాంటి గోదామ్ లు, పాత సామన్లు నిల్వ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అగ్నిప్రమాదం వల్ల నష్టపోయినవారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి తగిన నష్టపరిహారం ఇప్పించే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆందోజు సత్యంచారి, నాయకులు శ్రీనివాస్ నాయక్, గోపిమధు, భీమ్ నాయక్, నాగిరెడ్డి, సాయియాదవ్, భిక్షపతి, విష్ణు, కింగ్ మధు తదితరులు పాల్గొన్నారు.