16 May, 2026 | 8:38 AM

డోంట్ నో వై..

17-02-2025 12:21 AM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రస్తుతం రూపొందిస్తున్న చిత్రం ‘మ్యాజిక్’. ‘జెర్సీ’ వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మ్యూజికల్ డ్రామా ఇది. ఇందులో సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాశ్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌గా విడుదలైన ‘డోంట్ నో వై’ అనే గీతం ఆకట్టుకుంటోంది. అనిరుధ్ పాట ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల కావటం కొన్నేళ్లుగా ఓ సాంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాజా పాటతో మరోసారి కట్టిపడేశారు అనిరుధ్.

మూవీ టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ పాటకు కంపోజ్ చేసిన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు అనిరుధ్. ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో అద్భుతంగా సాగుతోందీ పాట. అనిరుధ్, ఐశ్వర్య సురేశ్ కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గీతానికి తెలుగులో కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, తమిళ సాహిత్యాన్ని విఘ్నేశ్ శివన్ రాశారు. తమ కాలేజీ ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు యువకులు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి డీవోపీ: గిరీశ్ గంగాధరన్; ఎడిటర్: నవీన్ నూలి; బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్; నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య.