25 July, 2026 | 6:00 AM

మెక్సికో అధ్యక్ష పీఠంపై తొలి మహిళ

04-06-2024 03:02 AM
  • క్లాడియా షీనన్‌బామ్ ఎన్నిక

చరిత్రలోనే తొలిసారి అత్యధిక పోలింగ్ నమోదు

మెక్సికో, జూన్ 3 : మెక్సికో అధ్యక్ష ఎన్నికలు ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఆ దేశానికి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షురాలిగా మోరెనా పార్టీకి చెందిన క్లాడియా షీన్‌బామ్ ఎన్నికయ్యారు. దాదాపు 200 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం విశేషం. ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రాడర్ స్థానంలో అక్టోబర్ 1న క్లాడియా షీన్‌బావ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికల బరిలో రెండు ప్రధాన కూటముల నుంచి మహిళల పోటీలో ఉన్నారు.

ఒకరు మోరెనా పార్టీకి చెందిన క్లాడియా షిన్‌బావ్ కాగా, మరొకరు ‘ఫోర్స్ అండ్ హార్ట్ ఫర్ మెక్సికో కొయిలేషన్’కు చెందిన సొచిల్లి గాల్వెజ్. మెక్సికో ఎలక్టోరల్ అథారిటీ ర్యాపిడ్ శాంపిల్ కౌంటర్ ప్రకారం, సుమారు 13 కోట్ల జనాభా గల మెక్సికోలో దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. మెక్సికో చరిత్రలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవ్వడం ఇదే తొలిసారి. కాగా, ఎన్నికల వేళ మెక్సికోలో పలుచోట్ల హింస చెలరేగింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నేర సంస్థలు హత్య చేశాయి. ఈ ఘటనల్లో దాదాపు 38 మంది అభ్యర్థులు మరణించారు.

మేయర్‌గా సాహసోపేత నిర్ణయాలు..

నూతనంగా ఎన్నికైన 61 ఏళ్ల క్లాడియా షీన్‌బామ్ ఓ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, 2007లో నోబెల్ గ్రహీత, మెక్సికో సిటీ మాజీ మేయర్‌గా కూడా పనిచేశారు. మేయర్‌గా ఉన్న సమయంలో కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అందరి మన్ననలు పొందారు.