బడ్జెట్ నుంచి భద్రత వరకు..
న్యూఢిల్లీ, జూన్ ౩: మన బిజీ లైఫ్‌లో కొద్దిగా ఉపశమనం అవసరం. పని ఒత్తిడి, టెన్షన్ల నుంచి బయటపడేందుకు చాలా మంది విహారయాత్రలను ఎంచుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కొంత అలసట కలిగించిన శరీరంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అయితే, యాత్ర పూర్తయి ఇంటికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపానికి గురవుతాం. ఖర్చులు, ఊహించని అనుభవాలు, ప్రయాణం కారణంగా అలసట ఇందుకు కారణం. సరైన ప్రణాళిక, డెస్టినేషన్ ఎంపిక, అక్కడి ఎలా వెళ్లాలి? వెళ్లాక అక్కడ ఏ విధంగా ట్రావెల్ చేయాలనే విషయాలను చూద్దాం..
1. బడ్జెట్: మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ముందు కావాల్సింది డబ్బు. ట్రాన్స్‌పోర్ట్, అకామిడేషన్, ఆహారం, షాపింగ్, ఇతర ఖర్చులు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సరిగ్గా అంచనా వేసి ఉన్న సేవింగ్స్‌కు తగినట్లు ఖర్చులను లెక్కేసి బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. అనవసర ఖర్చులను మినహాయించుకోవాలి.
2. డెస్టినేషన్ ఎంపిక: ప్లాన్ చేసుకున్న బడ్జెట్‌కు తగిన విధంగా ఏ ప్రదేశానికి వెళ్లాలో ఎంపిక చేసుకోవాలి. భారత్‌లోనైనా లేదా విదేశీ సందర్శన అయినా బడ్జెట్‌కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
3. పరిశీలన: ఎక్కడికి వెళ్లాలో ఫిక్స్ అయ్యాక ఆ ప్రదేశంలో ఎక్కడికి వెళ్లాలి, ఏమేం చూడాలి, షాపింగ్ ఎలా చేయాలి అనే విషయాలను ముందే తెలుసుకోవడం ముఖ్యం. సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది ప్రయాణంలో ఉన్నప్పుడు అనవసరమైన ఆలోచ నలకు దూరంగా ఉండేలా చేసి పూర్తిగా ట్రావెల్‌పై దృష్టి పెట్టేందుకు ఆస్కారం కల్పిస్తుంది.
4. అడ్వాన్స్ బుకింగ్: డెస్టినేషన్‌ను చేరుకునేందుకు ట్రైన్ లేదా ఫ్లుటైకు అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డిస్కౌంట్లు, ఉచిత క్యాన్సిలేషన్, రీషెడ్యూల్, ఇతర సౌకర్యాలు లభిస్తాయి.
5. ప్లానింగ్: డెస్టినేషన్ చేరుకున్న తర్వాత అక్కడ ఏం చేయాలి? ఏ రోజు ఎటు వెళ్లాలి? వంటి జాబితా ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడికి వెళ్లాక ప్లానింగ్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. మనం వేసుకునే ప్రణాళికలను అవసరాన్ని బట్టి మార్చుకునేలా ఉండాలి. వాతావరణం, ప్రయాణంలో ఆలస్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
6. ఆరోగ్యం, భద్రత: ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం సహకరించకపోవచ్చు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన మందులు వెంట తీసుకువెళ్లాలి. సరైన అకామిడేషన్‌ను ఎంచుకోవాలి. అంతేకాకుండా ముందుగా బయలుదేరడం ముఖ్యం. లాస్ట్ మినిట్ ప్రయాణం ఇబ్బందులకు గురిచేస్తుంది.






