14 July, 2026 | 5:55 PM

చేపల మార్కెట్లు కిటకిట

09-06-2024 02:20 AM

మృగశిర కార్తెకు పెద్ద ఎత్తున చేపల కొనుగోలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (విజయక్రాంతి): మృగశిర కార్తెను పురస్కరించుకొని నగరంలోని రాంనగర్ చేపల మార్కెట్‌తో పాటు పలు చేపల మార్కెట్లు శనివారం కిటకిటలాడాయి. సాధారణ సమయంలో ప్రతిరోజూ 30 టన్నుల దాకా చేపలు దిగుమతి అవుతుండగా, మృగశిర కార్తె సందర్భంగా దాదాపు 50 నుంచి 60 టన్నుల వరకు దిగుమతి జరిగినట్టుగా వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా చేపల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రతిరోజు కిలో రూ. 100 నుంచి రూ. 120 ఉండే బొచ్చలు రూ. 120 నుంచి మొదలై రూ. 150 వరకు ధర పలికాయి.

రూ. 450 నుంచి రూ. 500 వరకు విక్రయించే కొర్రమీను చేపలు రూ. 550 వరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో చేపలు విక్రయించే వ్యాపారులతో పాటు చేపలను క్లీనింగ్ చేసే వర్కర్లకు చేతినిండా పని దొరికినట్టు అయ్యింది. వాస్తవానికి మృగశిర కార్తె శుక్రవారం కాగా, బత్తిని సోదరులు ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ శనివారం నిర్వహించిన కారణంగా చాలా వరకు మృగశిరకార్తెను శనివారంగా భావించినట్టుగా తెలుస్తోంది.  

చేప మందు పంపిణీ..

నారాయణఖేడ్, జూన్ 8: నారాయణఖేడ్ డివిజన్‌లోని నిజాంపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉచిత చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉబ్బసం, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి చేప మందు వేసినట్లు నిర్వాహకులు తడకంటి సాయా గౌడ్, పర్వా గౌడ్, నాగరాజు గౌడ్, సాయిబాబా, వెంకట్ గౌడ్ తెలిపారు.