14 July, 2026 | 6:30 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

కేటీపీఎస్ కాలుష్యంపై వివరాలివ్వండి

09-06-2024 02:19 AM

కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని సూచించింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి బూడిద, ఇతర కాలుష్యం కర్కవాగు, కిన్నెరసాని నదుల్లో కలుస్తున్నాయంటూ కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన దాసరి రమేష్ కుమార్, మరికొందరు 2017లో వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది.

పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ వాదించారు. 2022లో పీసీబీ అధికారులు నివేదికను సమర్పించారు. ఆ నివేదికలో కేటీపీఎస్‌లోని సెడిమెంటేషన్ ట్యాంక్ పనిచేయడం లేదని తెలిపారు. బూడిద కలిసిన నీటిని తాత్కాలిక ద్వారం ద్వారా నేరుగా కర్కవాగులోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో మురుగునీటి నిర్వహణకు మాత్రమే ఈ ద్వారాన్ని వాడుతున్నామని వెల్లడించింది. అయితే ఈ నివేదికతోపాటు ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేదు. దీంతో ప్రాజెక్టు పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా? అన్నది తేలాలంటే మరోసారి కేటీపీఎస్‌ను తనిఖీ చేసి సమగ్ర నివేదికతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని తాజాగా హైకోర్టు ఆదేశించింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

లోక్ అదాలత్‌లో 10.35 లక్షల కేసులు పరిష్కారం

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 10,35,520 కేసులు పరిష్కారమయ్యాయి. ఇరుపక్షాల కక్షిదారులు ఏకాభిప్రాయంతో కేసులను రాజీ చేసుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో 10.35 లక్షల కేసుల పరిష్కారం ద్వారా కక్షిదారులకు రూ.743 కోట్లు చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

అందులో ప్రీలిటిగేషన్ కేసులు 5,81,611, పెండింగ్ కేసులు 4,53,903 ఉన్నాయని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర లోక్ అదాలత్ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, జస్టిస్ సుజయ్ పౌల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి పర్యవేక్షణలో జరిగిన లోక్‌అదాలత్‌కు అనూహ్య స్పందన లభించిందన్నారు.

హైకోర్టులో 132 కేసుల పరిష్కారం

హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 132 కేసులు పరిష్కారం అయ్యాయి. వాటిలో మోటార్ వాహనాల సంబంధిత కేసులు 96 ఉన్నాయి. ప్రాథమిక దశలోనివి 31 కేసులున్నాయి. లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం ద్వారా రూ.9.5 కోట్లను పరిహారంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ద్వారా 900 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం శాంతివర్ధని ఒక ప్రకటనలో వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే శరత్, జస్టిస్ జే శ్రీనివాసరావులు లోక్ అదాలత్ బెంచ్‌లో కేసులను పరిష్కరించారు.