గేట్ కారేపల్లిలో మత్స్యకార సొసైటీ వివాదం ఉద్రిక్తతకు దారి
అధికారుల నిర్లక్ష్యంతో నువ్వా నేనా అనుకుంటూ కొట్టుకునే దాకా గ్రామస్తులు
తుమ్మలకుంటలో దూరి చెరువును లూటీ చేసిన గ్రామస్తులు
2011 లో మత్స్యకార సొసైటీలో ఏర్పాటు
మా సొంత భూములు అలాగే దేవాదాయ భూములకు సొసైటీ ఎలా చేస్తారంటున్న పట్టాదారులు
కారేపల్లి,(విజయ క్రాంతి): కారేపల్లి గ్రామంలో మత్స్యకార సొసైటీ వ్యవహారం తీవ్ర వివాదంగా మారి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్య మరింత ముదురడంతో గ్రామస్తుల మధ్య వాగ్వాదాలు చోటుచేసు కుంటున్నాయి. 2011 సంవత్సరం నుండి కొనసాగుతున్న ఈ మత్స్యకార సొసైటీ కార్యకలాపాలపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సొంత పట్టా భూములు, దేవదాయ భూములపై సొసైటీ ఏర్పాటు ఎలా జరిగిందని భూస్వాములు ప్రశ్నిస్తూ చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తప్పిదంతోనే సొసైటీ ఏర్పడడం జరిగిందని సంబంధిత అధికారులపై కేసులు అయినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉండగా, తుమ్మలకుంట చెరువులో గ్రామస్తులు దూరి చేపల వేట చేపట్టడంతో సొసైటీకి లక్షల్లో నష్టం వాటిల్లిందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సొసైటీ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.






