కుల బహిష్కరణ పేరుతో జరిమానాలు.. ఐదుగురికి జ్యుడీషియల్ రిమాండ్
భిక్కనూర్, జూలై 15(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో కుల బహిష్కరణ పేరుతో జరిమానాలు విధించి, నగదు డిమాండ్ చేసి బెదిరించిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. గ్రామానికి చెందిన చేట్కూరి బీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమి, బోరు బావి యాజమాన్య వివాదం నేపథ్యంలో కొందరు గ్రామ పెద్దలు అక్రమంగా డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, చెల్లించకపోతే కుల బహిష్కరణ చేస్తామని బెదిరించినట్లు కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా యెంకాయల రాజమల్లయ్య, బలీరి శ్రీశైలం, ఎర్రోళ్ల బీరయ్య, ఎర్రోళ్ల దేవయ్య, కర్షోళ్ల పరశయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు భిక్కనూర్ ఎస్‌ఐ డి. ఆంజనేయులు తెలిపారు.






