ముంపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి
ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వంశీకృష్ణ వినతి
అచ్చంపేట నవంబర్ 03: ఎస్‌ఎల్బిసికి అనుబంధంగా నిర్మిస్తున్న నక్కలగండి జలాశయంలో ముంపు గ్రామాలైన మర్లపాడు తండా, కేశ్య తండాలు ఇటీవల కురిసిన వర్షాలతో పూర్తి జలబిగ్బంధంలో చిక్కుకొని అపార నష్టం వాటిలిందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఎస్‌ఎల్బీసీ వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, బాలు నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా వర్షాల వలన మ ర్లపాడుతండా ప్రజలు ఇళ్లల్లోని నిత్యవసరాలు, పశుసంపదను, పంటలను పూర్తిగా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నష్టపోయిన బాధిత గ్రామ గిరిజనులను ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని అభ్యర్థించారు. గిరిజన ప్రజలు సీఎంతో తమ సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు.
దీనికి సీఎం స్పందిస్తూ పూర్తి నివేదికను కలెక్టర్ ద్వారా సిద్ధం చేయించి తనకు పంపించాలని అవసరమైన అన్నీ చర్యలు తీసుకుని ప్రజలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. తమది ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేందర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీ నివాసులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత మల్లేష్, నేతలుపాల్గొన్నారు.






