calender_icon.png 30 October, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వరద.. జలదిగ్బంధంలో కాలనీలు

30-10-2025 08:52:33 AM

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్(Warangal District) జిల్లాలో బుధవారం నాడు కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వరంగల్ నగరాన్ని వరద(Floods inundate Warangal city) ముంచెత్తింది. నిన్నటి భారీ వర్షానికి వరంగల్ లో 45 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరం పరిధిలో 30 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు బల్దియా అధికారులు తెలిపారు. వరద ఇంకా వీడకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కురుసిన భారీ వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. వరంగల్ లోని పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగరలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.

వరంగల్ నగరంలో 9, హనుమకొండలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్టీఆర్ఎఫ్, ఇతర రక్షణ బృందాలు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముంపు ప్రాంతాల వాసులను పడవల సహాయంతో తరలించారు. ఇప్పటి వరకు మొత్తం 1200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఎస్డీఆర్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. వరంగల్ లో 7 ప్రత్యేక బృందాలు ద్వారా వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు వరంగల్ లోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వరంగల్- హనుమకొండ మధ్య రాకపోకలు అంతరాయం కలిగింది. హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ములుగు వెళ్లే రోడ్డులో నాలలు ఉద్ధృతంగా ప్రవహిస్తుున్నాయి. బుధవారం అర్థరాత్రి వర్షం తగ్గిపోవడంతో రైళ్ల రాకపోకలు మొదలైనట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.