ద్రవ్యోల్బణం డేటా, ఫెడ్ మీట్‌పై దృష్టి
ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో గత వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2,000 పాయింట్ల విస్త్రత శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ప్రతీ ట్రేడింగ్ సెషన్లోనూ గ్యాప్ డౌన్ లేదా గ్యాప్ అప్‌తో ప్రారంభమై ఇన్వెస్టర్లను తీవ్ర అయోమయానికి గురిచేసింది. అయితే వారం మొత్తం మీద 3 శాతం లాభంతో కొత్త రికార్డుస్థాయి 23,290 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ సైతం చరిత్రాత్మక గరిష్ఠస్థాయి 76,693 పాయింట్ల వద్ద నిలిచింది. బీజేపీ నేతృత్వంలో ఏర్పడుతున్న ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలపై కొంత స్పష్టత వచ్చినందున ఈ వారం మార్కెట్ స్థిరంగా ప్రారంభం అవుతుందని, అటుతర్వాత ఇన్వెసర్టు పలు దేశీయ, అంతర్జాతీయ గణాంకాలపై దృష్టి సారిస్తారని విశ్లేషకులు చెపుతున్నారు. ముఖ్యంగా ఈ వారం వెలువడే రిటైల్ ద్రవ్యోల్బణం అంకెలు, యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమీక్షా సమావేశం మార్కెట్‌కు కీలకమైనవని వారు చెపుతున్నారు. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే ప్రధాన అంశాలివే...
న్యూఢిల్లీ, జూన్ 9
అంతర్జాతీయ ఆర్థికాంశాలు
జూన్ 10న జపాన్ జీడీపీ గణాంకాలు వెలువడతాయి. ఇదే రోజున ఆ దేశపు వినియోగదారుల సెంటిమెంట్ ను సూచించే ఎకో వాచర్స్ సర్వే వస్తుంది. జూన్ 11, 12 తేదీల్లో జీడీపీ వృద్ధి, జాబ్స్ రిపోర్ట్, పారిశ్రామికోత్పత్తి తదితర కీలక ఆర్థిక గణంకాలను యూకే ప్రకటిస్తుంది. జూన్ 12న చైనా ద్రవ్యోల్బణం డేటా వెల్లడవుతుంది. ఏప్రిల్‌లో 0.3 శాతంగా చైనా ద్రవ్యోల్బణం మే నెలలో 0.2 శాతానికి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి.






